భారత్ గొప్ప విజయం.. 8 మంది నేవీ మాజీ అధికారులను విడుదల చేసిన ఖతార్.. అసలేమైందంటే ?

Published : Feb 12, 2024, 08:54 AM IST
భారత్ గొప్ప విజయం.. 8 మంది నేవీ మాజీ అధికారులను విడుదల చేసిన ఖతార్.. అసలేమైందంటే ?

సారాంశం

18 నెలలుగా ఖతార్ జైల్లో మగ్గుతున్న ఇండియాన్ నేవీ మాజీ అధికారుల కోసం భారత్ చేసిన ప్రయత్నాలు గొప్ప విజయాన్ని అందించాయి. (Qatar releases 8 ex-Indian Navy officers) అక్కడి కోర్టు (Espionage case) వీరందరికి మొదట మరణ శిక్ష, దానిని తగ్గించి జైలు శిక్ష, తరువాత దానిని పూర్తిగా రద్దు చేసింది. (8 ex-Navy officers arrive in India) దీంతో వారంతా సోమవారం ఉదయం భారత్ కు తిరిగి వచ్చారు. ఇంతకీ అసలు వారు ఎందుకు అరెస్టు అయ్యారంటే ? 

గూఢచర్యం కేసులో ఖతర్ లో అరెస్టు అయి అక్కడి జైల్లో మగ్గుతున్న ఇండియన్ నేవీ మాజీ అధికారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. భారత్ దౌత్య ప్రయత్నాల వల్ల ఆ దేశం వారిని జైలు నుంచి విడుదల చేసింది. దీంతో వారు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందిలో ఏడుగురు ఇప్పటికే ఖతార్ నుంచి భారత్ కు చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘ఖతార్ లో నిర్బంధంలో ఉన్న దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. వీరిలో ఏడుగురు భారత్ కు తిరిగి వచ్చారు. ఈ పౌరులను విడుదల చేయడానికి, స్వదేశానికి రావడానికి వీలుగా ఖతార్ స్టేట్ ఎమిర్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

అసలేం జరిగిందంటే ? 
గూఢచర్యం కేసులో అల్ దహ్రాతో కలిసి పనిచేసిన 8 మంది నేవీ మాజీ అధికారులను 2022 ఆగస్టులో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిపై వచ్చిన ఆరోపణలు ఏంటని ఖతార్ అధికారులు గానీ, భారత అధికారులను గానీ బహిర్గతం చేయలేదు. ఈ కేసులో వారికి ఖతార్ ఫస్ట్ ఇన్ స్టెన్స్ కోర్టు 2023 అక్టోబర్ 26న మరణశిక్ష విధించింది. ఈ తీర్పు భారత్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో వెంటనే దౌత్యపరమైన చర్యలు ప్రారంభించింది. 

ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను పరిశీలించింది. ఈ ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఎనిమిది మంది భారత మాజీ నేవీ సిబ్బందికి విధించిన మరణశిక్షను ఖతార్ కోర్టు గత ఏడాది డిసెంబర్ 28న రద్దు చేసింది. మరణశిక్షను జైలు శిక్షకు మార్చింది. అయితే దీనిని కూడా భారత ప్రభుత్వం సవాలు చేసింది. ఈ అప్పీలును ఖతార్ ఫస్ట్ ఇన్ స్టెన్స్ కోర్టు విచారణకు స్వీకరించింది. తరువాత ఆ జైలు శిక్షను కూడా రద్దు చేసింది. 

కాగా.. ఖతర్ లో అరెస్టు అయిన  వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ లు ఉన్నారు. భారత్ కు తిరిగి వచ్చిన తరువాత వీరంతా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాని మోడీ జోక్యం లేకుండా తాము ఇండియాకు తిరిగి రావడం సాధ్యమయ్యేది కాదని అన్నారు. భారత ప్రభుత్వ నిరంతర కృషి వల్ల ఇది సాధ్యమైందని ఖతర్ నుంచి ఢిల్లీకి వచ్చిన మాజీ నేవీ అధికారి ఒకరు ‘ఇండియా టుడే’తో అన్నారు. ‘‘మేము భారత్ కు వచ్చేందుకు 18 నెలలు ఎదురుచూశాం. ప్రధానికి కృతజ్ఞతలు. మోడీ వ్యక్తిగత జోక్యం, ఖతార్ తో ఆయనకు అనుబంధం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు’’ అని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు