
హలాల్ మాంసాన్ని (halal meat) బహిష్కరించాలని కొన్ని రైట్ వింగ్ గ్రూపులు పిలుపునివ్వడం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మీడియా నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) బుధవారం సమాధానమిచ్చారు. హలాల్ మాంసంపై లేవనెత్తిన తీవ్రమైన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రైట్ వింగ్ డిమాండ్ చేసిందా, లెఫ్ట్ వింగ్ డిమాండ్ చేసిందా అనేది తమకు ప్రధానం కాదని.. తమ ప్రధాన ఆలోచన శాంతి, అభివృద్ధి, సామాన్యులకు భద్రత అని సీఎం బొమ్మై అన్నారు.
హలాల్ సమస్యపై ప్రభుత్వ వైఖరి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన సీఎం బొమ్మై.. ‘‘ఇది (హలాల్ ఇష్యూ) ఇప్పుడే ప్రారంభమైంది. మేము పూర్తిగా అధ్యయనం చేయవలసి ఉంది. ఎందుకంటే దీనికి ఎటువంటి నిబంధనలతో సంబంధం లేదు. హలాల్‌పై తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తబడ్డాయి. మేము వాటిని పరిశీలిస్తాం’’ అని చెప్పారు.
హలాల్‌ను బహిష్కరించాలని హిందూ సంస్థలు చేస్తున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని కోరినప్పుడు.. తమ వైఖరిని తర్వాత తెలియజేస్తామని బొమ్మై చెప్పారు. వివిధ సంస్థలు వారి సొంత ప్రచారాలు చేస్తాయని.. దేనికి ప్రతిస్పందించాలో , దేనిపై స్పందించకూడదో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. అవసరమైన చోట తాము ప్రతిస్పందిస్తామని.. లేకపోతే స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు.
రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తున్న ఇలాంటి సమస్యలపై ప్రశ్నించగా.. ఇలాంటివి జరిగినా రాష్ట్రంలో శాంతిభద్రతలు, సుహృద్భావ వాతావరణం దెబ్బతినకుండా చూశామని సీఎం బొమ్మై తెలిపారు. భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కర్ణాటకలో పెరుగుతున్న విద్వేషాలు, మత రాజకీయాలను అరికట్టాలని కర్ణాటకకు చెందిన 61 మంది మేధావులు తనకు రాసిన లేఖపై కూడా బొమ్మై స్పందించారు. వారు లేవనెత్తిన అంశాలు, సమస్యలపై అధ్యయనం చేస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ స్థితిని పరిశీలిస్తానని తెలిాపరు.
ఇక, హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కర్ణాటకలోని రైట్ వింగ్ గ్రూప్‌లు పిలుపునిచ్చాయి. ఉగాది పండగ మరుసటి రోజు Hosathodaku జరుపుకుంటారు. మైసూరు, రామనగర, మాండ్య జిల్లాలలో కొత్త సంవత్సర వేడుకలలో ఇది అంతర్భాగంగా ఉంటుంది. చాలా మంది హిందువులు ఆ రోజు మాంసం తింటారు. అయితే ముస్లిం వ్యాపారుల నుంచి Hosathodaku మాంసం కొనవద్దని రైట్ వింగ్ గ్రూపులు హిందువులను కోరుతున్నాయి. ఈ మాంసాన్ని హిందూ దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదని చెబుతున్నాయి.
ముస్లిం షాపుల్లో విక్రయించే మాంసం పవిత్రమైనది కాదని.. అందువల్ల హోసతోడకు ఉపయోగించరాదని హిందూ జన జాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ ఆరోపించారు. ‘హోసతోడ వేడుకలలో భాగంగా గృహాలలో వండిన నాన్-వెజ్ ఆహారాన్ని దేవతలకు నైవేద్యంగా పెడతారని చెప్పారు. కానీ ముస్లిం వ్యాపారులు తమ దేవుడికి సమర్పించిన తర్వాత మాత్రమే మాంసాన్ని విక్రయిస్తారు. కాబట్టి ఇది మన వేడుకలకు తగినది కాదు. ముస్లిం వ్యాపారులు విక్రయించే మాంసాన్ని బహిష్కరించాలని మేము నిర్ణయించుకున్నాము’ అని గౌడ తెలిపారు. ముస్లింలు హలాల్ లేని మాంసాన్ని విక్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు.
దీనిపై కొద్ది రోజులుగా రైట్ వింగ్ గ్రూప్స్ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి మంగళవారం హలాల్ ఆహారాన్ని "ఆర్థిక జిహాద్" అని కూడా కామెంట్ చేశారు. ముస్లింలు విక్రయించే హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని హిందువులను కోరుతూ హిందుత్వ సంస్థలు ఇచ్చిన పిలుపును ఆయన సమర్థించారు.