
ఉత్తరప్రదేశ్ లోని 12వ తరగతి బోర్డు ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో అధికారులు రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ తరగతి ఇంగ్లీషుకు ఉత్తరప్రదేశ్ బోర్డు పరీక్షను రద్దు చేశారు. రాష్ట్రంలోని ఆగ్రా, మధుర, అలీగఢ్, గోరఖ్‌పూర్ సహా 24 జిల్లాల్లో పరీక్షను రద్దు చేసినట్లు యూపీ మాధ్యమిక శిక్షా పరిషత్ డైరెక్టర్ వినయ్ కుమార్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన 51 జిల్లాల్లో నిర్ణీత సమయానికి పరీక్ష జరుగుతుందని చెప్పారు.
“ప్రశ్న పత్రం బహిర్గతం కావడంపై సందేహాలు ఉన్నందున ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేస్తున్నాం. 24 జిల్లాలలో అదే ప్రశ్నాపత్రం పంపిణీ చేశారు. అందువల్ల అక్కడ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్ష రెండో షిప్ట్ లో జరగాల్సి ఉంది. మిగిలిన జిల్లాలో యథావిధిగా పరీక్ష జరుగుతుంది” అని ప్రకటన విడుదల చేశారు.
బల్లియా జిల్లాలో పేపర్ లీక్ అయిందని ఆ ప్రకటన పేర్కొంది. దీంతో ఈ ప్రశ్నాపత్రం చేరిన జిల్లాలో తప్పా.. మిగిలిన అన్ని జిల్లాల్లో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. పరీక్ష రద్దయిన 24 జిల్లాల్లో పరీక్ష నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రకటనలో తెలిపారు. ఈ ప్రశ్నాపత్రం మార్కెట్ లో రూ.500 కు లభించినట్టు తెలుస్తోంది. లీక్ అయిన పేపర్లను 316Ed మరియు 316EiK సిరీస్‌లుగా గుర్తించారు.
కోవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత, ఉత్తరప్రదేశ్ బోర్డు కోసం పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు గత గురువారం ప్రారంభమయ్యాయి. చీటింగ్ ను నియంత్రించడానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు మొత్తం 2.97 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 8,373 పరీక్షా కేంద్రాల్లోని ఈ కెమెరాల ఫీడ్‌ను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లలో పర్యవేక్షిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.
పరీక్షల సమయంలో చీటింగ్ చేసిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 51.92 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 12 వరకు కొనసాగుతాయి. ఉదయం 8 నుండి 11.15 వరకు తరువాత మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5.15 వరకు రెండు షిఫ్టులలో నిర్వహిస్తున్నారు. ఈ లీకేజీకి కారణమైన వారిని పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.