
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల విడుదలైన The Kashmir Files చిత్రంపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో బుధవారం ఐపీ కాలేజీ నుంచి క్రేజ్రీవాల్ నివాసం వరకు ప్రదర్శన జరిగింది. సీఎం కేజ్రీవాల్ నివాసం ముందు ఆందోళన చేపట్టారు. కేజ్రీవాల్ ఇంటి వద్దకు భారీగా చేరుకన్న బీజేపీ కార్యకర్తలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంటి బయట ఉన్న గేటును ధ్వంసం చేశారు.
కాశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్ని కేజ్రీవాల్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ జెండాలు పట్టుకున్న పలువురు పోలీసులతో ఘర్షణ పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వారిలో కొందరు అక్కడి బారికేడ్లపైకి ఎక్కి పోలీసులు నెట్టుకుని ముందుకెళ్లుందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
‘దేశంలోని హిందువులను అవమానించినందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పే వరకు బీజేపీ యువమోర్చా అతనిని విడిచిపెట్టదు’ అని తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు.
కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల నిరసనను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముఖ్యమంత్రి నివాసానికి చేరుకోవడానికి ఢిల్లీ పోలీసులు సహకరించారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు విధ్వంసం, హింసను సులభతరం చేశారని పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విమర్శించారు.
‘‘సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ దాడి! సెక్యూరిటీ బారియర్స్‌ను పగలగొట్టి.. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. బీజేపీ ఢిల్లీ పోలీసుల పూర్తి మద్దతుతో ఇలా చేశారు. కాశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించాలని మీరు డిమాండ్ చేశారా?’’ అని ఆప్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ బారియర్స్‌ను సంఘవిద్రోహులు ధ్వంసం చేశారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్‌లో తెలిపారు. బీజేపీ గూండాలు సీఎం కేజ్రీవాల్ ఇంటిని ధ్వంసం చేస్తూనే ఉన్నారని.. పోలీసులు వారిని అడ్డుకోకుండా ఇంటి గుమ్మం వద్దకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనికి పాల్పడింది బీజేపీ గుండాలేనని అన్నారు. వారిని ఢిల్లీ పోలీసులు సహాయం చేశారని ఆరోపించారు.
ఇక, ఇటీవల ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై స్పందించిన కేజ్రీవాల్.. ‘‘ఈ చిత్రాన్ని పన్ను మినహాయించాలని బీజేపీ డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని అడగండి. అలా అయితే అందరూ ఉచితంగా చూస్తారు. పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సినిమా ద్వారా సంపాదించిన డబ్బును కాశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం ఉపయోగించాలని, వారిని స్వస్థలాకు తీసుకురావడానికి కృషి చేయాలి.
గత 25 ఏళ్లలో.. కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లిన తర్వాత,13 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. గత 8 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది.. కానీ ఒక్క కాశ్మీరీ పండిట్ కూడా తిరిగి అక్కడ స్థిరపడలేదు. కాశ్మీరీ పండిట్ల అఘాయిత్యాలను బీజేపీ రాజకీయం చేసింది.. ఇప్పుడు వారి విషాదంపై సినిమాలు తీసి డబ్బు సంపాదిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ దాదాపు రూ.200 కోట్లు సంపాదించారు’’ అని అన్నారు.