మంచి రోడ్ల వల్లే ఎక్కువ ప్రమాదాలు.. బీజేపీ ఎమ్మెల్యే వింత వివరణ

By Mahesh KFirst Published Jan 22, 2023, 4:52 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదాలపై విచిత్ర వివరణ ఇచ్చారు. రోడ్లు మెరుగ్గా ఉండటం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లు మంచిగా ఉండటం వల్ల డ్రైవర్లు తమ వాహనాలను హై స్పీడ్‌తో నడుపుకుంటూ వెళ్లుతున్నారని వివరించారు.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదాలపై ఇచ్చిన వివరణ షాక్‌కు గురి చేస్తున్నది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్లు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తారు. కానీ, ఆయన మాత్రం విచిత్రంగా మంచి రోడ్ల కారణంగానే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయని బాంబు పేల్చారు. మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా జిల్లాలోని మందానా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నా నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్లు చాలా బాగున్నాయి. అందువల్ల వాహనాలు చాలా వేగంగా (హై స్పీడ్‌తో) ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా వాహనాలపై డ్రైవర్లు పట్టు కోల్పోతున్నారు. నేను ఈ స్థితిని అనుభవించాను. కొందరు డ్రైవర్లు అయితే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తారు. అలా యాక్సిడెంట్లు జరుగుతాయి’ నారాయణ్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ తన విచిత్ర వివరణ ఇచ్చారు.

Also Read: కలవరం పెడుతున్న చాయ్ అమ్ముకునే వ్యక్తి ఆత్మహత్య.. తొలుత కొవిడ్, తర్వాత బుల్‌డోజర్ దెబ్బతో విలవిల్లాడి.. !

మధ్యప్రదేశ్‌లో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయనే ఫిర్యాదులు ఒక వైపు.. అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరగడంతో విలేకరులు ఈ విషయాలను ప్రజా ప్రతినిధుల ముందు ఉంచుతున్నారు. రోడ్లు బాగా లేనందున ప్రమాదాలు తక్కువగా జరుగుతాయని చెప్పడాన్ని మీరు నమ్ముతారా? అని ఓ రిపోర్టర్ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్‌ను అడిగారు. దీనికి సమాధానంగా రోడ్లు మంచిగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయని వివరించారు.

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రోడ్లు మెరుగ్గా ఉన్నాయని వాదిస్తూ ఉంటుంది. 2017లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్‌లో రోడ్డు అమెరికా కంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఇదే విషయాన్ని ఆయన 2018లో పలు సభల్లో పునరుద్ఘాటించారు.

click me!