Golden Temple-pakistan: చరిత్రలోనే మొదటిసారి..లైట్లు ఆర్పేసి మరి..డ్రోన్లను తిప్పికొట్టాం

Published : May 20, 2025, 11:01 AM IST
Golden Temple-pakistan: చరిత్రలోనే మొదటిసారి..లైట్లు ఆర్పేసి మరి..డ్రోన్లను తిప్పికొట్టాం

సారాంశం

ఆపరేషన్ సింధూర్ సమయంలో, పాకిస్తాన్ నుండి వచ్చే డ్రోన్లు, క్షిపణుల ముప్పును ఎదుర్కోవడానికి స్వర్ణదేవాలయం యాజమాన్యం భారత సైన్యానికి వైమానిక రక్షణ తుపాకులను మోహరించడానికి అనుమతించింది.

 పంజాబ్‌ అమృతసర్‌లోని స్వర్ణదేవాలయం పరిసరాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా, పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ ముప్పును ముందుగానే గుర్తించి భారత సైన్యం చురుకుగా స్పందించింది. ఈ క్రమంలో స్వర్ణదేవాలయం లైట్లను తొలిసారి నిలిపివేసి, వైమానిక రక్షణ తుపాకులను మోహరించేందుకు దేవాలయ యాజమాన్యం అనుమతి ఇచ్చిందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమెర్ ఇవాన్ డికున్హా వెల్లడించారు.

రాత్రివేళల్లో డ్రోన్లను కనిపెట్టడం కష్టమవుతుండటంతో, లైట్లు ఆపడంతో గగనతలంలో ప్రయాణిస్తున్న వాటిని స్పష్టంగా గుర్తించే అవకాశం లభించిందని తెలిపారు. దేవాలయం వంటి అంతర్జాతీయ ఖ్యాతి గల ప్రాంతాన్ని పాక్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ముందే అంచనా వేసిన భారత సైన్యం, వాటిని ఎదుర్కొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

స్వర్ణదేవాలయం అధికారుల సహకారం మెచ్చుకోదగినదిగా పేర్కొంటూ, ముప్పు వివరించిన వెంటనే వారు తుపాకులు మోహరించడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. లెఫ్టినెంట్ జనరల్ డికున్హా ప్రకారం, పాక్ తన డ్రోన్లతో అంతర్గతంగా గందరగోళం కలిగించేందుకు ప్రయత్నించినా, భారత సైన్యం వ్యూహాత్మకంగా స్పందించి వాటిని నిర్వీర్యం చేసింది.

ఇదే సమయంలో, పదవీవిరమణ చేసిన భారత సైనికులు పంజాబ్, హర్యానా, జమ్మూ ప్రాంతాల నుంచి ముందుకు వచ్చి దేశానికి సేవ చేయాలని సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఇది దేశ పట్ల వారి సమర్పణను, జాతీయ భావాన్ని చాటిచెప్పుతుంది.

పాక్ డ్రోన్ వ్యూహాన్ని వివరిస్తూ, మొదట చౌకైన డ్రోన్లను తక్కువ ఎత్తులో పంపి భారత రాడార్ వ్యవస్థను బలహీనపరచాలనే యత్నం చేసినప్పటికీ, భారత సైన్యం దాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంది. సరిగ్గా తుపాకుల పరిధిలోకి వచ్చిన డ్రోన్లను పరిక్షమిస్తూ, రాడార్ సిగ్నల్స్‌ను ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది.

భారత ఉపగ్రహ నిఘా వ్యవస్థలు, AEW&C విమానాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాల సహాయంతో పాక్ కమాండ్ అండ్ కంట్రోల్ సదుపాయాలను దెబ్బతీయగలిగాయి. ఈ చర్యలు పాక్ డ్రోన్లను అంతరించేందుకు కీ రోల్ పోషించాయి.

ఈ మొత్తం ఆపరేషన్ భారతదేశం రక్షణ వ్యూహాల్లో  ముందస్తు భద్రత చర్యల దిశగా వెళ్తోందని సూచిస్తుంది. శత్రు దాడులను ఎదుర్కొనేందుకు భారత రక్షణ శక్తి ఎంత మేరకు సిద్ధంగా ఉందో ‘ఆపరేషన్ సింధూర్’తో స్పష్టమైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu