
Godhra Train-Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో నలుగురు దోషుల పాత్ర దృష్ట్యా వారి బెయిల్‌ను తిరస్కరించారు. ఎనిమిది మంది దోషులు 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఎనిమిది మంది దోషులుగా నిర్ధారించబడి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడినవారు.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ లోని గోద్రా జిల్లాలో 2008లో జరిగిన సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు దగ్ధం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఏఎన్ఐ నివేదించిది. ఎనిమిది మంది దోషులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 17-18 ఏళ్లు జైలు జీవితం గడిపిన ఈ దోషులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ దోషులకు కింది కోర్టు, హైకోర్టు జీవిత ఖైదు విధించాయి.
నలుగురు దోషులకు బెయిల్ నిరాకరణ
దీంతో పాటు నలుగురు దోషులకు ఊరట కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నలుగురు దోషులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఉరిశిక్ష పడిన నలుగురు దోషులు మినహా మిగిలిన దోషులకు బెయిల్ ఇవ్వొచ్చని విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది.
కోచ్ ను బయటి నుంచి తాళం వేసి తగలబెట్టారు: తుషార్ మెహతా
గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ కోచ్ కు బయటి నుంచి నిప్పు పెట్టారని తెలిపారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 59 మంది మృతి చెందారు. తన పాత్ర కేవలం రాళ్లు రువ్వడం వరకే పరిమితమైందని కొందరు అంటున్నారని తుషార్ మెహతా అన్నారు. కానీ ఒక పెట్టెను బయటి నుంచి తాళం వేసి, దానికి నిప్పుపెట్టి, ఆపై రాళ్లు విసిరినప్పుడు అది కేవలం రాళ్లు రువ్వడం మాత్రమే కాదని వాదించారు.
ఫరూక్ కు బెయిల్ మంజూరు..
ఈ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఫరూక్ కు బెయిల్ మంజూరు చేసింది. 17 ఏళ్లుగా జైలులో ఉన్న ఫరూక్ కు గత ఏడాది డిసెంబర్ 15న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఫరూక్ కు బెయిల్ ఇవ్వడాన్ని సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు.