Goa Election 2022 : గోవా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం.. 79 శాతం ఓటింగ్ నమోదు

Published : Feb 14, 2022, 11:48 PM IST
Goa Election 2022 : గోవా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతం.. 79 శాతం ఓటింగ్ నమోదు

సారాంశం

గోవా అసెంబ్లీకి సోమవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోలేదు. ఈ సారి బీజేపీ 22 స్థానాలు సాధిస్తుందని సీఎం ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు. 

Goa Election News 2022 :  గోవా (goa)లో సోమవారం 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో అత్యధికంగా 78.94 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ స‌మ‌యంలో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లూ చోటు చేసుకోలేద‌ని అధికారులు తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన 301 మంది అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం ఈవీఎంలో లాక్ చేశారు. మార్చి 10వ తేదీన వీటిని తెరిచి కౌంటింగ్ చేప‌ట్ట‌నున్నారు. 

ఎన్నిక‌ల ముగిసిన సంద‌ర్భంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కునాల్ (kunal) మీడియాతో మాట్లాడారు. ఉత్తర గోవాలోని సంఖలిమ్ నియోజకవర్గంలో అత్యధికంగా 89.61 శాతం ఓటింగ్ నమోదైందని, దక్షిణ గోవాలోని బెనౌలిమ్‌లో అత్యల్పంగా 70.20 శాతం ఓటింగ్ నమోదైందని చెప్పారు. మొత్తంగా 78.94 శాతం ఓటింగ్‌ నమోదైందని చెప్పారు. అయితే పూర్తి డేటా వ‌చ్చిన త‌రువాత పోలింగ్ శాతం పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలైన ఓట్లను కలిపితే ఓటింగ్ శాతం 80 శాతం దాటే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 11 లక్షల మందికి పైగా ఓట‌ర్లు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. వాస్కో నియోజకవర్గంలో అత్యధికంగా 35,139 మంది ఓటర్లు ఉండగా, మోర్ముగావ్ స్థానంలో అత్యల్పంగా 19,958 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 13,150 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేయ‌గా.. మొత్తం 12,546 మంది పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేశారని కునాల్ తెలిపారు.1,722 బూత్‌లలో పోలింగ్ నిర్వహించామని సీఈవో కునాల్ తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో 80 మంది అభ్యర్థుల‌కు నేర చరిత్ర ఉంద‌ని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓటింగ్‌కు ముందు వాటిని మీడియాలో ప్రచురించామని ఆయ‌న చెప్పారు. 

ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని, ఎలాంటి అవకతవకలకు సంబంధించి తీవ్రమైన ఫిర్యాదు అందలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మధ్యాహ్నం స‌మ‌యంలో వేర్వేరు ఘటనల్లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామ‌ని ఆయ‌న అన్నారు. ఓ సంఘటనలో, బిచోలిమ్ వద్ద ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తి కారుకు నిప్పంటించగా, సాన్‌వోర్డెమ్ వద్ద ఒక వ్యక్తి వ‌ద్ద నగదు ల‌భించాయ‌ని తెలిపారు. జనవరి ప్రారంభం నుంచి ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావళి అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని, అప్ప‌టి నుంచి మొత్తం రూ.6.06 కోట్ల నగదు పట్టుబడిందని ఆయన చెప్పారు. ఇదే స‌మ‌యంలో రూ.3.57 కోట్ల విలువైన మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.

ఇదిలా ఉండ‌గా.. ఆదివారం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (pramod sawant) మీడియాతో మాట్లాడుతూ.. 40 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 22 సీట్లకు పైగా గెలుస్తుందని తెలిపారు. గోవాలో త‌మ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను అత్యున్నత పదవిలో కొనసాగుతానని ధీమా వ్య‌క్తం చేశారు. నేటి ఉద‌యం సంఖలిమ్‌లోని ఒక బూత్‌లో ఓటు వేసిన అనంతరం సావంత్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ (prime minister narendra modi) ఉదయం తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారని అన్నారు. 

గోవాలో కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)), తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఎంజీపీ, (MGP) శివసేన (Shivasena), ఎన్సీపీ (ncp), రెవల్యూషనరీ గోవాన్స్ (Revolutionary Goans), గోయెంచో స్వాభిమాన్ పార్టీ (Goencho Swabhimaan Party), జై మహాభారత్ పార్టీ (Jai Mahabharat Party) ఎన్నికల బరిలో నిలిచాయి. దీంతో పాటు 68 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu