వివాహితకు వేధింపులు.. రాఖీ కట్టించుకోవాలంటూ కోర్టు షాకింగ్ తీర్పు

By telugu news teamFirst Published Aug 3, 2020, 8:32 AM IST
Highlights

ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి 30 ఏళ్ల వివాహిత ఇంట్లోకి ప్రవేశించి వేధించాడని పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.
 

వివాహితను ఓ ఆకతాయి వేధించాడు. అయితే..  ఆ ఆకతాయికి  కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. రాఖీ పండగ సందర్భంగా.. కోర్టు ఆ తీర్పు ఇవ్వడం గమనార్హం. రక్షాబంధన్ సందర్భంగా బాధిత వివాహితతో రాఖీ కట్టించుకొని 11 వేలు ఇవ్వాలని నిందితుడికి కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మహిళను వేధించిన కేసులో నిందితుడైన వ్యక్తి బాధిత వివాహితతో రాఖీ కట్టించుకొని, ఆమెకు 11వేల రూపాయలు ఇచ్చి బాధితురాలితో ఆశీర్వాదం పొందాలని ఇండోర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి 30 ఏళ్ల వివాహిత ఇంట్లోకి ప్రవేశించి వేధించాడని పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు నిందితుడైన విక్రమ్ బాగ్రిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిందితుడైన బాగ్రికి రూ.50వేల వ్యక్తిగత పూచికత్తుపై ఇండోర్ కోర్టు జస్టిస్ రోహిత్ ఆర్య షరతులతో కూడిన బెయిలు ఇస్తూ రక్షాబంధన్ సందర్భంగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 3వతేదీన 11 గంటలకు నిందితుడు తన భార్యతో కలిసి బాధిత వివాహిత ఇంటికి స్వీటు బాక్సుతో వెళ్లి, ఆమెతో రాఖీ కట్టించుకొని భవిష్యత్తులో ఆమెకు రక్షణగా ఉంటానని వాగ్ధానం చేసి, రూ.11వేలు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. బాధితురాలి కుమారుడికి రూ.5వేలతో బట్టలు, స్వీట్లు కొని ఇచ్చి, బాధిత వివాహిత ఆశీర్వాదం పొందాలని నిందితుడు బాగ్రికి జడ్జి ఆదేశించారు. 

click me!