
బీహార్ : మద్యం అక్రమ రవాణా కేసులో ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను 11 రోజులుగా పోలీస్ రిమాండ్ లో ఉంచారు. జూలై 6న బాక్సర్ జిల్లాలోని ఘాజీపూర్ వద్ద ఇది పట్టుబడింది. రాష్ట్ర సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో విదేశీ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కారులో జర్మన్ షెఫర్డ్ కుక్క కూడా ఉంది. దీంతో కుక్కను కూడా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఏం ఆలోచించి పోలీసులు కుక్కను అదుపులోకి తీసుకున్నారు తెలియదు. కానీ, ఇప్పుడు అదే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కుక్క రోజువారీ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. స్టేషన్ సిబ్బంది తలా కొంత చందాలు వేసుకొని కుక్కకు ఆహారం పెడుతున్నారు. ఈ మర్యాదలు ఏ మాత్రం తగినా సదరు కుక్కగారు గట్టిగా మొరుగుతూ అందరినీ ఇబ్బంది పెడుతుంది. దీంతో ఆ కుక్కను తీసుకు వెళ్లాలని యజమానిని పోలీసులు వేడుకుంటున్నారు.
వివరాల్లోకి వెడితే.. పాట్నాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పోలీసులు జర్మన్ షెపర్డ్ ఆడ కుక్కను అరెస్టు చేశారు. దీనికి కార్న్‌ఫ్లెక్స్, కుక్కల ఫుడ్ మాత్రమే తింటుంది. దీంతో పోలీసులకు దీన్ని పోషించడం తలకు మించిన భారంగా మారింది. దీనిమీద పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, "కుక్కను మా అదుపులో ఉంచుకోవడం చాలా ఖరీదైనది. అలాగే, కుక్కకు ఇంగ్లీషులో సూచనలు ఇస్తే మాత్రమే అర్థమవుతుంది. ఇదీ మాకు తలనొప్పే అయ్యింది. దీనికోసం స్థానికగా ఇంగ్లీష్-తెలిసిన యువకుల సహాయాన్ని కోరతున్నాం" అని చెప్పుకొచ్చారు.
భలే కిలాడి ఈ అమెరికా మహిళ.. డబ్బుల కోసం తల్లిదండ్రులతోనే ఫేక్ కిడ్నాప్ డ్రామా..
బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నిందితులతో పాటు, వారితో ఉన్న జర్మన్ షెపర్డ్ ఆడ కుక్కను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బక్సర్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రకారం..., ఇక్కడి నుండి 100 కి.మీ. దూరంలో జూలై 6న, ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్ నుండి వస్తున్న ఒక SUVని బక్సర్ పోలీసులు తనిఖీ చేశారు.
ఈ కారులో ఆరు ఐఎంఎఫ్‌ఎల్ బాటిళ్లను పోలీసులు కనుగొన్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష తర్వాత మద్యం మత్తులో ఉన్న సతీష్ కుమార్, భువనేశ్వర్ యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎక్సైజ్ చట్టాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి బక్సర్ సెంట్రల్ జైలుకు తరలించారు. బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద వారి వాహనాన్ని కూడా జప్తు చేశారు. చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం, మద్యం తీసుకువెళుతున్న ఏదైనా వాహనం జప్తు చేయబడుతుంది, సెక్షన్ 57 ప్రకారం, దొరికిన మత్తు పదార్థాలు కూడా జప్తు చేయబడతాయి.
సెక్షన్ 56(2) నిబంధనలను అనుసరించి, మద్యం తరలిస్తున్న వాహనంలో దొరికిన జంతువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ జర్మన్ షెపర్డ్ ఆడ కుక్కను పోలీస్ స్టేషన్‌లో ఉంచింది. ఆ కుక్కకు కార్న్‌ఫ్లెక్స్, ఇతర కుక్కల ఫీడ్‌లను పెడుతున్నారు. అయితే ఇది వీరికి తలకు మించిన భారంగా మారింది. ఆర్థికంగానే కాక.. సమయం కూడా దీనికి వృధా అవుతుండడంతో తలలు పట్టుకోవడం ఇప్పుడు పోలీసుల వంతయ్యింది.