సుప్రీంకోర్టును ఆశ్రయించిన గే దంపతులు.. తమ పెళ్లిని చట్టబద్ధంగా గుర్తించాలని విజ్ఞప్తి

By Mahesh KFirst Published Nov 25, 2022, 3:03 PM IST
Highlights

గే దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ పెళ్లిని చట్టబద్ధంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాము 17ఏళ్ల నుంచి కలిసే ఉంటున్నామని, ఇద్దరు పిల్లలను పెంచుతున్నామని చెప్పినవారు.. తమ పెళ్లికి చట్టపరమైన గుర్తింపు లేనందున తల్లిదండ్రులు, పిల్లల మధ్య లీగల్ రిలేషన్‌షిప్ లేకుండా పోయిందని తెలిపారు. రాజ్యాంగం తమకు ఇతర పౌరుల్లాగే ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కును కల్పించిందని గుర్తు చేస్తూనే వాటిని అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోర్టును కోరారు.
 

న్యూఢిల్లీ: గే దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పెళ్లిని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చట్టబద్ధంగా గుర్తించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తమ పెళ్లిని గుర్తించడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ వారు ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కును కలిగి ఉన్నారు. కానీ, వారి పెళ్లిని గుర్తించే లీగల్ ఫ్రేమ్ వర్క్ మాత్రం లేదు. ఈ కొరతను గే కపుల్స్ సుప్రీంకోర్టులో లేవనెత్తారు.

ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు అమలు కోసం ఆదేశాలు జారీ చేయాలని, దీని అమలుతో న్యాయపరంగా గుర్తింపు దక్కడమే కాదు.. ప్రజల్లోనూ ఎదురయ్యే ఏహ్యభావం నుంచి బయటపడే ఆస్కారం దక్కుతుందని పిటిషన్‌లో ఆ కపుల్ వివరించారు.

ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ ప్రయోజనాల కోసం ఈ పిల్‌ను ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు.

Also Read: అమెరికాలోని గే నైట్ క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి, 18 మందికి గాయాలు..

తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునే హక్కును రాజ్యాంగం పౌరులకు కల్పించినట్టే, ఆ హక్కు తమకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు ఇది వరకే స్పష్టంగా చెప్పి ఉన్నదని ఆ పిటిషన్ పేర్కొంది. రాజ్యాంగం ఇతర పౌరులకు కల్పించే హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నీ ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీకి కూడా వర్తిస్తాయని వెల్లడించిందని గుర్తు చేసింది. కానీ, మన దేశంలో వివాహ వ్యవస్థ ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ హక్కులను ఇంకా అనుమతించడం లేదని వారు పేర్కొన్నారు. రాజ్యాంగం హామీపడ్డ ఈ హక్కులను ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ పొందలేకపోతున్నదని వివరించారు.

ఇది ఆర్టికల్స్ 14, 15, 19(1)(ఏ), 21ల ఉల్లంఘనే అని పిటిషనర్లు పేర్కొన్నారు.

తాము ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నామని, 17 ఏళ్లు కలిసే జీవిస్తున్నామని, తాము ఇద్దరు పిల్లలను పెంచుతున్నామని పిటిషనర్లు వివరించారు. కానీ, దురదృష్టవశాత్తు తాము తమ పెళ్లిని చట్టబద్ధం చేయలేకుండా ఉన్నామని తెలిపారు. ఈ కారణంగా వారికి తల్లిదండ్రులు, పిల్లల మధ్య లీగల్ రిలేషన్‌షిప్‌కు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

click me!