Journalist found dead: రోడ్డు పక్కన కాలిన స్థితిలో జర్నలిస్ట్ మృతదేహం.. కిడ్నాప్ అయిన నాలుగు రోజుల తర్వాత..

By team teluguFirst Published Nov 14, 2021, 10:20 AM IST
Highlights

బుద్దినాథ్ ఝా (Buddhinath Jha) అలియాస్ అవినాష్ ఝా స్థానిక న్యూస్ పోర్టల్‌లో జర్నలిస్టుగా (Journalist) పనిచేస్తున్నాడు. అతడు మెడికల్ క్లినిక్‌లకు (medical clinics) సంబంధించి ఓ పోస్టును ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన అతడి మృతదేహాన్ని రోడ్డు పక్కన కాలిన స్థితిలో కనిపించింది.

నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌ గురైన యువ జర్నలిస్టు, ఆర్టీఐ కార్యకర్త మృతదేహాన్ని రోడ్డు పక్కన కాలిన స్థితిలో కనిపించింది. ఈ ఘటన బిహార్‌లోని మధుబని జిల్లాలో (Madhubani district) చోటుచేసుకుంది. వివరాలు.. బుద్దినాథ్ ఝా (Buddhinath Jha) అలియాస్ అవినాష్ ఝా స్థానిక న్యూస్ పోర్టల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అతడు మెడికల్ క్లినిక్‌లకు (medical clinics) సంబంధించి ఓ పోస్టును ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. అందులో అవన్నీ నకిలీవి అని ఆరోపించాడు. ఈ క్రమంలోనే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇది కొన్ని క్లినిక్‌లను మూసివేయడానికి, మరికొన్నింటికి భారీగా జరిమానాలు విధించడానికి కారణమైంది. 

ఇక, మెడికల్ క్లినిక్‌లకు సంబంధించి రిపోర్ట్‌ చేస్తున్న సమయంలో బుద్దినాథ్‌కు అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. అంతేకాకుండా కొందరు భారీగా డబ్బు ఆశ కూడా చూపెట్టారు. అయితే బుద్దినాథ్ మాత్రం ఎలాంటి బెదిరింపులకు, డబ్బు ఆశకు లోబడకుండా.. అన రిపోర్ట్‌ను పూర్తి చేశాడు. దీంతో కొందరు అతనిపై కక్ష గట్టినట్టుగా తెలుస్తోంది. 

ఇక, బుద్దినాథ్ తన ఇంటికి సమీపంలోని బేనిపట్టిలోని లోహియా చౌక్ (Lohia Chowk in Benipatti) సమీపంలో చివరిసారిగా మంగళవారం రాత్రి 10 గంటలకు కనిపించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. మరోవైపు బుద్దినాథ్ ఇల్లు కూడా స్థానిక పోలీస్ స్టేషన్‌ నుంచి 400 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అతను ఇంటి బయట ఫోన్‌లో మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. ఆ తర్వాత అక్కడే పలుమార్లు తిరిగినట్టుగా గుర్తించాడు. ఇక, రాత్రి 9.58 గంటలకు పసుపు కండువా ధరించి అతను ఇంటి నుంచి బయలుదేరాడు.

ఆ తర్వాత బేనిపట్టి పోలీసు స్టేషన్ దాటుకుని అతను లోహియా చౌక్ వైపు వేగంగా నడించాడు. ఇది రాత్రి 10.05 నుంచి 10. 10 గంటల మధ్య జరిగింది. అక్కడ మార్కెట్‌లో ఓ వ్యక్తి కనిపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బుద్దినాథ్ కనిపించకుండా పోయాడు. బుధవారం కుటుంబ సభ్యులు మేల్కొనే సరికి బుద్దినాథ్ ఆచూకీ కనిపించలేదు. అయితే అతని మోటార్ సైకిల్ ఇంట్లోనే ఉంది. మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున ఏదో పని మీద బుద్దినాథ్ బయటకు వెళ్లాడని.. సాయంత్రం వరకు తిరిగి వస్తాడని భావించారు. కానీ బుద్దినాథ్‌ తిరిగి రాలేదు.

దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేశారు. దీంతో పోలీసులు బుద్దినాత్ ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. బేనిపట్టికి పశ్చిమాన 5 కి.మీ దూరంలో ఉన్న బీటౌన్ గ్రామంలో బుధవారం ఉదయం 9 గంటలకు స్విచ్ ఆన్ చేసినట్లు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు.. ఆ తర్వాత ఎటువంటి ఆధారాలను కనుగొనలేకపోయారు.

ఇక, శుక్రవారం రోజున బుద్ధినాథ్ బంధువు బిజె వికాస్‌కు బిటౌన్ గ్రామం సమీపంలోని హైవేపై మృతదేహం కనిపించినట్లు సమాచారం అందింది. దీంతో అధికారులు, బంధువులు అక్కడి చేరుకున్నారు. అయితే మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అది బుద్దినాథ్‌దేనని గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. పోలీసు స్టేషన్‌నికి సమీపంలోనే ఉన్న వ్యక్తి ఎలా కిడ్నాప్‌ అయ్యాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

click me!