Gaganyaan : అంతరిక్షంలోకి దూసుకెళ్లే భారత వ్యోమగాములు వీరే..?

By Arun Kumar P  |  First Published Feb 27, 2024, 8:28 AM IST

భారత కీర్తి పతాకాన్ని అంతరిక్షంలో ఎగరేసే అరుదైన అవకాశం నలుగురు వ్యోమగాములకు దక్కనుంది. గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఇస్రో సిద్దం చేసినట్లు తెలుస్తోంది. 


బెంగళూరు : ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రదేశాలు అమెరికా, రష్యా, చైనాలకు సాధ్యంకానివి కూడా భారత్ చేసి చూపిస్తోంది. ఇలా అతి తక్కువ ఖర్చుతో మంగళయాన్ ద్వారా అంగారకుడిపైకి, చంద్రయాన్ ద్వారా చంద్రుడిపైకి విజయవంతంగా చేరుకుంది. ఇక ఇప్పుడు మనుషులను అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్దమయ్యింది  ఇస్రో (భారత అంతరిక్ష పరిశోదన సంస్థ). గగన్ యాన్ పేరిట చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ లో ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గగన్ యాన్ ప్రకటన చేసారు. ఇండియా మొదటిసారి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించనుందని...  ఇందుకోసం ఇస్రో ఏర్పాట్లు చేస్తోందని ప్రధాని ప్రకటించారు. ఇలా భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు భారత్ అంతరిక్షంలోకి పంపే ఈ వ్యోమగాములు ఎవరో తెలుసుకునేందుకు యావత్ భారతప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సస్పెన్స్ కు తెరపడి ఆ వ్యోమగాములు ఎవరో తెలిసిపోనుంది.  

Latest Videos

గగన్ యాన్ మిషన్ లో అంతరిక్షయానం కోసం వ్యోమగాములకు ఇస్రో ఇప్పటికే శిక్షణ ఇప్పిస్తోంది. వీరిలో నలుగురిని గగన్ యాన్ మిషన్ కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైమానిక దళానికి చెందిన పైలట్స్ ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణ, చౌహాన్ లను ఇస్రో అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం బెంగళూరులో వ్యోమగామ శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read  అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేసిన ప్రధాని మోదీ... (ఫొటోలు)

అయితే గగన్ యాన్ వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు సమాచారం. నేడు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో వేదికగా ప్రధాని ఈ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. నేడు కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగానే వ్యోమగాముల పేర్లను ప్రధాని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 


 

click me!