వైరల్ అవుతున్న పాత ట్వీట్ వివాదంపై స్పందించిన సినీ నటి ఖుష్బూ.. ఆ వ్యాఖ్యలకు సిగ్గుపడటం లేదంటూ కామెంట్..

By Asianet NewsFirst Published Mar 26, 2023, 12:34 PM IST
Highlights

రెండు రోజుల నుంచి వైరల్ అవుతున్న పాత ట్వీట్ పై సినీ నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. తాను ఆ సమయంలో పార్టీ నాయకుడిని అనుసరించానని అన్నారు. ఆ ట్వీట్ ను తొలగించబోనని తెలిపారు. 

‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలిన నేపథ్యంలో సినీ నటి ఖుష్బూ సుందర్ గతంలో చేసిన ట్వీట్ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ను అనేక మంది కాంగ్రెస్ నాయకులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా మళ్లీ షేర్ చేశారు. ఇప్పుడు ఆమెపై కూడా పరువు నష్టం దావా వేస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఆ ట్వీట్ చేసిన సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ లో కూడా మెంబర్ గా ఉన్నారు.

రాజ్‌ఘాట్‌ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం.. పోలీసులు అనుమతి లేకున్నా కొనసాగుతున్న దీక్ష..

2018లో చేసిన ఆ ట్వీట్ వైరల్ అవుతుండటంతో తాజాగా ఆ నటి స్పందించారు. ఆ సమయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడటం లేదని తేల్చి చెప్పారు. అప్పుడు తాను పార్టీ నాయకుడి వ్యాఖ్యలను అనుసరించానని అన్నారు. ‘‘ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన ‘మోడీ’ ట్వీట్ కు సిగ్గుపడటం లేదు. అప్పుడు నేను నాయకుడిని అనుసరిస్తూ, పార్టీ భాషను మాత్రమే మాట్లాడాను. ’’ అని ఆమె మీడియాతో అన్నారు. 

కాంగ్రెస్ సంకల్ప సత్యాగ్రాహ దీక్షలో జగదీష్ టైట్లర్: నెటిజన్ల విమర్శలు

కాంగ్రెస్ పై ఖుష్బూ సుందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రత్యర్థి పార్టీ (కాంగ్రెస్) ఎంత నిరాశకు లోనవుతుందో దీనిని బట్టి తెలుస్తోంది. ’’ అని అన్నారు. ‘మోడీ’ అనే ఇంటిపేరును అవమానించడంలో తప్పు కనిపించలేదా అని ప్రశ్నించగా.. ‘రాహుల్ గాంధీ మోడీలందరినీ ‘చోర్స్’ అని పిలిచారు. నేను ‘అవినీతి’ అనే పదాన్ని మాత్రమే వాడాను.’’ అని తెలిపారు. వారికి సత్తా ఉంటే తనపై కేసు పెట్టాలని ఆమె కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. తాను దానిని చట్టపరంగా ఎదుర్కొంటానని అన్నారు. పాత ట్వీట్ ను తన టైమ్ లైన్ నుంచి తొలగించలేదని, తాను ఎప్పుడూ అలా చేయబోనని అన్నారు. 

‘మోడీ ఇంటిపేరు’ను దొంగతో పోల్చినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా తేలి, లోక్ సభ సభ్యుడిగా అనర్హుడైన నేపథ్యంలో ఖుష్బూ పాత ట్వీట్‌ను కాంగ్రెస్ లేవనెత్తడం గమనార్హం. ఈ ట్వీట్ ను కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ శనివారం రీట్వీట్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీని ‘‘మోడీ జీ, మీ శిష్యుడు మోడీ అనే వ్యక్తి బీజేపీ సభ్యురాలైన ఖుష్బూ సుందర్‌పై పరువునష్టం కేసు పెడుతారా చూద్దాం ?’’ అని అన్నారు.

ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లలేదు- కర్ణాటకలో కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి దూసుకెళ్లిన ఘటనపై పోలీసుల వివరణ

కాగా.. ఖుష్బు సుందర్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. ఆమె మొదట ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)లో చేరారు. తరువాత కొంత కాలం కాంగ్రెస్ లో పని చేశారు. 2019లో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ లో సభ్యురాలిగా పని చేస్తున్నారు. 
 

click me!