రాజ్‌ఘాట్‌ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం.. పోలీసులు అనుమతి లేకున్నా కొనసాగుతున్న దీక్ష..

By Sumanth KanukulaFirst Published Mar 26, 2023, 11:54 AM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు ‘‘సంకల్ప్ సత్యాగ్రహ’’ దీక్షను ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఆ పార్టీ అధిష్టానం నిరసనలకు పిలునిచ్చింది. రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు సత్యాగ్రహ దీక్ష జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు ‘‘సంకల్ప్ సత్యాగ్రహ’’ దీక్షను ప్రారంభించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జైరామ్ రమేష్, ముకుల్ వాస్నిక్, పవన్ కుమార్ బన్సల్, శక్తిసిన్హ్ గోహిల్, జోతిమణి తదితరులు కూడా ఈ నిరసన దీక్షలో పాలుపంచుకున్నారు. 

అయితే కాంగ్రెస్ సత్యాగ్రహా దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు రాజ్‌ఘాట్ వెలుపల గుమిగూడారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ కారణాల వల్ల కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష అభ్యర్థన తిరస్కరించబడిందని.. రాజ్‌ఘాట్, పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 సీఆర్‌పీసీ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సత్యాగ్రహానికి అనుమతి నిరాకరించబడినప్పటికీ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపినట్టుగా పీటీఐ రిపోర్టు చేసింది. 

ఢిల్లీ పోలీసుల చర్యపై కేసీ వేణుగోపాల్ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. “పార్లమెంటులో మా గొంతును నిశ్శబ్దం చేసిన తరువాత.. బాపు (మహాత్మా గాంధీ) సమాధి వద్ద కూడా శాంతియుత సత్యాగ్రహం చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది. ప్రతిపక్షాల నిరసనను అనుమతించకపోవడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇది మమ్మల్ని నిరోధించదు.. సత్యం కోసం మా పోరాటం. దౌర్జన్యానికి వ్యతిరేకంగా కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. అయితే పోలీసులు అనుమతి లేకపోయినప్పటికీ.. రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు దిగడంతో.. అక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. 

ఇక, రాహుల్ గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన దీక్షకు దిగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు వరకు ఈ సత్యాగ్రహ దీక్షలు కొనసాగనున్నాయి. 

ఇదిలా ఉంటే.. 2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అయితే రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష జరపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

click me!