
ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ పై ఓ మహిళా ఫ్యాన్ దురుసుగా ప్రవర్తించింది. స్టేజీపై ప్రదర్శన ఇస్తున్న సమయంలో అతడిని చేయి పట్టుకొని గట్టిగా కిందకి లాగింది. ఆ యువతి చేసిన పనికి అతడి చేయి బెణికింది. దీంతో అతడు ఆమెను సున్నితంగా మందలించాడు. తరువాత కూడా తన ప్రదర్శన కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముస్లిం కోటా రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలు సరికావు - సుప్రీంకోర్టు
మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్‌మార్క్‌లో అర్జిత్ సింగ్ ఆదివారం స్టేజీ ఫర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఓ యువతి అర్జిత్ సింగ్ ను అత్యుత్సాహంతో కిందకి లాగింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అతడి చేతికి గాయమయ్యింది. దీంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు సున్నితంగా క్లాస్ తీసుకున్నాడు. ‘మీరు చేసిన పనికి నా చేతులు వణుకుతున్నాయి. మీరు మీ సమయాన్ని సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చారు. దాంట్లో సమస్యేమీ లేదు. కానీ నేను ప్రదర్శన ఇవ్వకపోతే మీకు ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది. మీరు నన్ను లాగారు. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి.’’ అని అన్నారు. ఓ సమయంలో ‘‘మరి నేను ఇక్కడి నుంచి బయలుదేరాలా’’ అని అనడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ ‘వద్దూ’ అని అరిచారు. పలుమార్లు ఆ యువతిని ఉద్దేశించి ‘నన్ను ఎందుకు అలా లాగారు. చూడండి నా చేయి వణుకుతోంది. నేను చేయిని కదపలేకపోతున్నాను’’ అని అన్నారు.
అయితే ఆ యువతి అర్జిత్ సింగ్ కు క్షమాపణలు చెప్పింది. తానెందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పేందుకు ప్రయత్నించింది. ఎంతో నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన ప్రదర్శనను తరువాత కొనసాగించాడు. అయితే తరువాత ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీలో అర్జిత్ సింగ్ చేతికి కట్టుతో కనిపించాడు. ఈ ఘటన గురించి ఆయన అందులో వివరించినట్టు కనిపిస్తోంది.
కాగా.. అర్జిత్ సింగ్ ఆ యువతిని సున్నితంగా మందలించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై యూజర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఓ సింగర్ పై ఫ్యాన్ ఇలా ప్రవర్తించడం సరికాదు. అంతనొప్పిలోనూ ఆయన కోపంగా మాట్లాడకుండా.. ఆమెతో సున్నితంగా మాట్లాడుతున్నాడు.’’ అని పేర్కొన్నారు. ‘‘ఓ కళాకారుడు ప్రతీ ఒక్క అభిమాని కోసం నాన్ స్టాప్ గా 4 గంటలు తన హృదయంతో ప్రదర్శన ఇచ్చాడు. దయచేసి సంగీతాన్ని ఆస్వాదించండి. వాటిని మీరు వింటూ ఆనందించండి..కానీ మర్యాదగా నడుచుకోండి. ’’ అని మరో యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ ‘‘ఒక అభిమానిగా సంఘటనను అవమానంగా భావిస్తున్నాను. త్వరగా కోలుకో లెజెండ్.” పేర్కొన్నాడు.