దిగివచ్చిన అన్నదాతలు.. రెండ్రోజుల్లో ఢిల్లీని ఖాళీ చేస్తామన్న రాకేశ్ టికాయత్

By Siva KodatiFirst Published Dec 9, 2021, 3:29 PM IST
Highlights

రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు గురువారం ప్రకటించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు

వివాదాస్పద సాగు చట్టాలను (farm laws) రద్దు చేయాలని కోరుతూ.. ఏడాదికిపైగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఇటీవల ప్రకటన చేశారు. అంతేకాదు పార్లమెంట్ సమావేశాల్లో (parliament winter session) కూడా ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వం మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని, ఆందోళన విరమించాలని రైతులను ప్రభుత్వం కోరుతోంది.

ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు గురువారం ప్రకటించారు. అయితే, డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళనలను ఇతర రాష్ట్రాల్లో.. వివిధ రూపాల్లో కొనసాగిస్తామని తెలిపారు. హామీల అమలుకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వకంగా ఉండాలని డిమాండ్ చేశారు.  జనవరి 15న మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని రైతు నేతలు చెప్పారు. 

Also Read:ఇకనైనా శాంతించండి.. రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ, ఆందోళనలపై రేపు తేల్చనున్న రైతు సంఘాలు

కాగా.. భారతీయ కిసాన్​ యూనియన్​ ( Bharatiya kisan union)  నేత రాకేశ్​ టికాయిత్​ (rakesh tikait) కు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. దీంతో ఆయ‌న ఘజియాబాద్‌లోని కౌశాంబి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేశారు.  నిందితుడు తొలుత అస‌భ్యక‌రంగా మాట్లాడి.. ఆపై చంపేస్తాన‌ని.. రోజులు లెక్క‌పెట్టుకోమ‌ని  బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు  అధికారులు తెలిపారు. ఆ కాల్స్ ఉత్త‌రాఖండ్ నుంచి వ‌చ్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. త్వ‌ర‌లోనే ఆ నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జీ సచిన్​మాలిక్ తెలిపారు. ఆడియో క్లిప్‌ను టికాయిత్ ద్వారా అందుకొని, దాని ఆధారంగా తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు. అయితే దాని వెనుకున్న ఉద్దేశాన్ని బయటపెట్టలేదని చెప్పారు.

మరోవైపు ఈ ఉద్య‌మ‌నేత‌కు గ‌తంలోనూ అనేక సార్లు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఆయ‌నను హత్య చేయాల‌ని ప‌లు కుట్ర‌లు కూడా జ‌రిగాయి. వీటిని తెలుసుకున్న పోలీసులు భ‌గ్నం చేశారు. ఆ త‌రువాత నుంచి ఆయ‌న‌కు కూడా భ‌ద్ర‌త క‌ల్పిస్తోన్నారు. కేంద్రం రూపొందించిన నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టారు. వారి ఉద్య‌మం ఉప్పెన‌లా ఎగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మంలో ఘాజీపుర్ సరిహద్దు నుంచి టికాయిత్​ నాయ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో అనేక నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బ‌డ్డాయి. ఈ స‌మ‌యంలో అనేక బెదిరింపులు, కుట్ర‌లు వెలుగులోకి వ‌చ్చాయి. 

click me!