
పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగాలని ఎంపీలకు సూచించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) .శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయమని సంభోదించారు. చర్చల సమయంలో గాంధేయ తత్వాన్ని వినియోగించాలని కోరారు. పార్లమెంట్‌లో చర్చ, అసమ్మతి తెలియజేసే సమయంలో ఎంపీలు గాంధీ మార్గాన్ని అనుసరించాలని రాష్ట్రపతి కోరారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. అంతకుముందు శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఇకపోతే.. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల అభ్యర్ధి ద్రౌపది ముర్ము (draupadi murmu) విజయం సాధించగా.. విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా పరాజయం పాలయ్యారు. భారత 15వ రాష్ట్రపతిగా జూలై 25న ఉదయం 10.14 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ అత్యున్నత పీఠానికి ఎంపికైన తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకెక్కారు. రాష్ట్రపతి సచివాలయంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.