1995లో ఎన్టీఆర్.. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే.. నమ్మినవారి నుంచే వెన్నుపోటు!

By Mahesh KFirst Published Jun 24, 2022, 7:13 PM IST
Highlights

నా అనుకున్నవారి నుంచే వెన్నుపోటు ఎదురవడం కుటుంబ పార్టీల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. సమాజ్‌వాదీ పార్టీ మొదలు ఆర్జేడీ, టీడీపీ వరకు ఇలాంటి ఘటనలు చూశాం. టీడీపీ మినహా ఇతర పార్టీల్లో అది ద్రోహంగా మారకముందే నివారించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు నమ్మిన వారి నుంచే తిరుగుబాటు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్: రాజకీయాలను కచ్చితత్వంతో ఊహించలేం. ఒక్కోసారి పెద్దగా శ్రమ లేకున్నా వెలిగిపోతారు. కొన్నిసార్లు ఎంత వేగంగా శిఖరాలను అధిరోహించారో అంతే వేగంతో అధోపాతాళానికి పడిపోతుంటారు. అందుకే ఓడలు బండ్లు అవుతాయి అనే కొటేషన్ పాలిటిక్స్‌లో ఫేమస్. ఈ వాదనలకు సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితం అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే.. సినీ ప్రపంచంలో, ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఎదిగిన ఎన్టీఆర్ చాలా వేగంగా కూలిపోయాడు. రోజుల వ్యవధిలోనే సీఎం పదవి, పార్టీని కూడా కోల్పోయాడు. ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఎమ్మెల్యేగా గెలువకున్నా ముఖ్యమంత్రి సీటు అలంకరించాడు. బాల్ ఠాక్రే తర్వాత పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. బాలా సాహెబ్ నుంచి బోధనలు విని.. శివసేనలో అత్యంత విశ్వసనీయ నేతగా మెదిలిన ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు పార్టీ శ్రేణుల్లో జీర్ణించుకోలని పరిణామంగా మారింది. సీఎం పదవి అక్కర్లేదని మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే వెంటనే సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ను వీడి తన నివాసం ‘మాతో శ్రీ’కి మారాడు. సీఎం పదవినే కాదు.. ఇప్పుడు పార్టీ పగ్గాలకూ ఈ తిరుగుబాటు ఎసరు పెట్టినట్టు తెలుస్తూనే ఉన్నది.

ఎన్టీఆర్ ఉత్థాన పతనాలు క్లుప్తంగా చూస్తే.. సినీ ప్రపంచంలో రారాజుగా రాణించిన ఆయన రాజకీయంలోకి దిగారు. అక్కడా ఆయనకు విజయాలే వరించాయి. అంటే కష్టపడలేదని కాదు. కానీ, సినీ ప్రపంచం వేరు.. రాజకీయాలు వేరు. రాజకీయాల్లో ఎవరు ప్రత్యర్థో.. ఎవరు శత్రువో.. ఎవరు ఆప్తులో అట్టే గుర్తుపట్టలేం. ఎన్టీఆర్ కూడా రాజకీయాలు అంచనా వేయలేక పొరబడ్డాడు. దాని ఫలితమే.. ఆయన తన జీవితంలో సాధించిన విజయాలకు పొంతనలేని చివరి రోజులను గడిపారు. 

1989లో ఓడిపోయి 1994లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఇక తనకు ఎదురేలేదన్న కాన్ఫిడెన్స్‌తో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఆయన ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న అల్లుడు చంద్రబాబు నాయుడే సీఎం పదవికి ఎసరు పెడతాడని ఊహించలేదు. రెండో భార్యగా లక్ష్మీ పార్వతిని స్వీకరించడం కారణంగా ఇంటిలోనే వ్యతిరేకత పుడుతుందని అనుకోలేదు. వీటిని ఆ అసంతృప్తినే ఆధారం చేసుకుని ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న సమయంలో వెన్నుపోటు రాజకీయానికి బాబు తెర లేపాడని ఆరోపణలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులూ సహకరించడంతో తెలుగు ప్రజల ‘అన్నగారు’గా ఉన్న ఒంటరివాడు అయ్యాడు. పదవీ పోయింది.. పార్టీ పోయింది. వైస్రాయ్ హోటల్ వెన్నుపోటు రాజకీయంతో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి సీటు నుంచే కాదు.. టీడీపీ అధ్యక్ష పదవి నుంచీ తొలగించారు. ఇది సరిపోదన్నట్టు దారుణంగా అవమానించారు కూడా. మన అనుకున్నవారి నుంచే వెన్నుపోటుకు గురికావడంతో ఎన్టీఆర్ తీవ్రంగా చలించిపోయాడు. ఆ బాధ కలిగించే ఉన్మత్తతో హైదరాబాద్ నగరంలో కత్తిని వెన్నులో పెట్టుకుని తాను వెన్నుపోటుకు గురయ్యాననీ చెప్పుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన మరెంతో కాలం జీవించలేకపోయారు. 1996లో తుది శ్వాస విడిచారు.

ఎన్టీఆర్ అనే కాదు.. కుటుంబ సభ్యుల చేతుల్లోని రాజకీయ పార్టీల్లో ఇలా ఇంటి వారి (మన అనుకున్నవారి నుంచి కూడా) నుంచే వ్యతిరేకత ఎక్కువ వస్తుండటాన్ని మనం పరిశీలించవచ్చు. కానీ, చాలా వరకు ఆ పార్టీలు పరిస్థితులు పూర్తిగా దిగజారి వెన్నుపోటుగా పరిణమించకముందే సర్దుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీలోనైతే.. తండ్రి కొడుకులకే పడదు. ఆర్జేడీ పార్టీ పగ్గాల కోసం తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. కానీ, లాలు జోక్యంతో అసంతృప్తిగానైనా గొడవ సద్దుమణిగింది. కాంగ్రెస్‌లోనూ పార్టీలో ప్రాధాన్యం కోసం గాంధీల మధ్య విభేదాలు వచ్చాయి. టీఎంసీలోనూ దీదీ.. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల మధ్య బేధాభిప్రాయాలను చూడవచ్చు. ఇటీవలే ఓ విషయంలో తమదే నెగ్గాలనేట్టు అభిషేక్ బెనర్జీకి ప్రత్యేక వర్గం ఒకటి తయారైనా.. మమతా బెనర్జీ వారిని రాజీకి తేగలిగింది.

ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పదవీతోపాటు పార్టీ చీఫ్ కోల్పోయే గండాన్ని కూడా ఎదుర్కొంటున్నాడు. పార్టీ ఎమ్మెల్యేలను మెజార్టీగా తన వెంట పెట్టుకుని ఉద్ధవ్ ఠాక్రేను కాదని, ఆయన తండ్రి బాల్ ఠాక్రేను స్తుతించడం ఈ అనుమానాలను బలపరిచింది. ఏక్‌నాథ్ షిండే నియోజకవర్గంలోనూ బాల్ ఠాక్రే, ఆనంద్ దిగే, ఏక్‌నాథ్ షిండేలతో వెలసిన పోస్టర్లలో ఉద్ధవ్ ఠాక్రే ఫొటో లేదు. తామే అసలైన శివసైనికులం అనే వాదనను వారు లేవనెత్తుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ హైడ్రామాకు తెరపడే అవకాశం ఉన్నది. మరి.. సీఎం పదవితోపాటు పార్టీపైనా పట్టును ఉద్ధవ్ ఠాక్రే నిలుపుకోగలడా? లేక రోజుల వ్యవధిలోనే తాను కూడా మళ్లీ ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే వెళ్లాల్సి ఉంటుందా? దీనికి కాలమే సమాధానం చెబుతుంది.

click me!