ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజాంఖాన్, ఆయన భార్య, కొడుకులకు నకిలీ జనన ధ్రువపత్రం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. తప్పుడు జనన ధృవపత్రాలు ఇచ్చారన్నకేసులో ఆజంఖాన్ తోపాటు ఆయన భార్య తజీన్ ఫాతిమా, కొడుకు అబ్దుల్లా ఆజంఖాన్ లకు కూడా జైలు శిక్ష పడింది. నకిలీ జనన ధ్రువపత్రం కేసులో వారిని కూడా దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..
సమాజ్వాది పార్టీ నేత ఆజంఖాన్ కొడుకు అబ్దుల్లా ఆజంఖాన్ జనవరి 1, 1993లో పుట్టినట్లుగా తెలుపుతూ రాంపూర్ మున్సిపాలిటీ ఒక ధ్రువపత్రం ఇచ్చింది. కాగా, అబ్దుల్లా ఆజంఖాన్ 1990, సెప్టెంబర్ 30న లఖ్ నవూలో పుట్టినట్లుగా మరో సర్టిఫికెట్ ఉంది. అబ్దుల్లా ఆజంఖాన్ నకిలీ జనన ధ్రువపత్రాలు తీసుకోవడంలో ఆయన తల్లిదండ్రులైన తజీన్ ఫాతిమా, ఆజంఖాన్లు కూడా సహకరించారని ఉత్తర ప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్ లోని గంజి పోలీస్ స్టేషన్లో 2019 జనవరి మూడున ఫిర్యాదు చేశారు.
ప్రజా ప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ కోర్టు మెజిస్ట్రేట్ శోభిత్ బన్సల్ బుధవారం అబ్దుల్లా ఆజంఖాన్, ఫాతిమా, అబ్దుల్లా ఆజంఖాన్ లను దోషులుగా నిర్ధారించింది. వీరికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.