త్రిపుర గవర్నర్ గా తెలంగాణ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి...

By SumaBala Bukka  |  First Published Oct 19, 2023, 6:49 AM IST

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను నియమించారు. 


న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిజెపిలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ బిజెపి  సీనియర్ నేతను త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు నల్లు ఇంద్రసేనారెడ్డి. ఆయనను త్రిపుర గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడం చర్చనీయాంశంగా మారింది.  ప్రస్తుతం నల్లు ఇంద్రసేనారెడ్డి.. టీ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అండగా ఉంటూ.. పార్టీ వైపు నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

నల్లు ఇంద్రసేనారెడ్డి నల్గొండ జిల్లా వాసి. ప్రస్తుతం సూర్యపేట జిల్లాలోని ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామం ఆయన స్వస్థలం. తొలితరం బిజెపి నేతల్లో నల్లు ఇంద్రసేనారెడ్డి అత్యంత ముఖ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. నల్లు ఇంద్రసేనారెడ్డి రాజకీయ జీవితం ఏబీవీపీలో మొదలయ్యింది. ఏబీవీపీలో చేరి, ఆ విభాగం ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా నల్లు ఇంద్రసేనారెడ్డి  పని చేశారు. ఆ తర్వాతి క్రమంలో బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఎమర్జెన్సీ సమయంలో నల్లు ఇంద్రసేనారెడ్డి  జైలుకు కూడా వెళ్లారు. 

Latest Videos

భార్య మరణ వార్త తట్టుకోలేక.. తుపాకీతో కాల్చుకున్న బీఎస్ఎఫ్ జవాన్..

1983లో మొదటిసారిగా మలక్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అలా బిజెపి నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1983లో హోం మంత్రిగా ఉన్న ప్రభాకర్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు నల్లు ఇంద్రసేనారెడ్డి. అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావును ఓడించారు. ఈ ఎన్నికల్లో  నాదెండ్ల మీద 17,791 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి గెలిచి, శాసనసభ పక్షనేతగా నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యవహరించారు. 

2003 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ పదవిలో 2006వరకు నల్లు ఇంద్రసేనారెడ్డి  కొనసాగారు. ఆ తరువాత 2007లో బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమితులై, ఇప్పటివరకు జాతీయ కార్యవర్గంలోనే కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ నల్లు ఇంద్రసేనారెడ్డి కీలకంగా వ్యవహరించారు. తెలంగాణకు అనుకూలంగా బిజెపి కీలక నిర్ణయం తీసుకోవడంలో నల్లు ఇంద్రసేనారెడ్డి పాత్ర కీలకం.  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు బిజెపి మొట్టమొదటిసారి 2005లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని ప్రకటన చేసింది.  ఆ సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాజ్నాథ్ సింగ్  బిజెపి తెలంగాణ  ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటుకు కట్టుబడి ఉందని తొలిసారిగా ప్రకటన చేశారు. ఇలా చేయడం వెనక ఆ సమయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డిది  ప్రధాన భూమిక. నల్లు ఇంద్రసేనారెడ్డిముక్కు సూటిగా వ్యవహరిస్తారు.  పార్టీలో అనేక సమయాల్లో కీలక నిర్ణయాల్లో నల్లు ఇంద్రసేనారెడ్డి  పాత్ర ఉంది.

నల్లు ఇంద్రసేనారెడ్డి  అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసే నాయకుడు.నల్లు ఇంద్రసేనారెడ్డికి గతంలో కూడా గవర్నర్ గా పదవి ఇచ్చే ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పట్లో ఆయన దీనికి సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు కీలకంగా ఉన్న సమయంలో త్రిపుర గవర్నర్గా నియమితులు కావడం, దానికి ఆయన అంగీకరించడం బిజెపి వర్గాలను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. తెలంగాణకు చెందిన బిజెపి నేతలు గవర్నర్లుగా నియామకం కావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. బండారు దత్తాత్రేయ ఇప్పటికే హర్యానా గవర్నర్ గా ఉన్నారు.

మరోవైపు ఒడిశా గవర్నర్ ను కూడా బిజెపి నియమించింది.  ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు. రఘుబర్ దాస్ 2019 నుంచి 2019 వరకు ఝార్ఖండ్ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి కార్యాలయం రఘుబర్ దాస్, ఇంద్రసేనారెడ్డిలను ఒడిశా, త్రిపుర గవర్నర్లుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. 

click me!