వాటిని కంట్రోల్ చేస్తాం.. భారత్ కి హామీ ఇచ్చిన ఫేస్ బుక్..

First Published 7, Jul 2018, 3:00 PM IST
Highlights

ఎన్నికల సమయంలో తమ నెట్‌వర్క్‌ ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలు పెట్టే అన్ని అబద్ధపు పోస్ట్‌లను వైరల్‌ కాకుండా నిలువరించేందుకు ఫేస్‌బుక్‌ సమాయత్తమైంది.

2019 లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. యావత్ భారతదేశం రాజకీయాలతో వేడెక్కుతోంది. ఇప్పటికే పలువురు రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే విషయంపై పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాన సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్.. భారత ఎన్నికల కమిషన్‌కు హామీ ఇచ్చింది. ప్రచారంలో భాగంగా పలువురు ఫేస్ బుక్ వేదికగా చేసే అసత్య ప్రచారాన్ని అడ్డుకుంటామని భారత్ ఎన్నికల కమీషన్ కి తెలిపింది. 

రెండు నెలల కింద సియోల్‌లో వ్యక్తిగతంగా తనను కలిసిన భారత ఎన్నికల కమిషనర్‌ ఓం ప్రకాష్‌ రావత్‌కు సంస్థ గ్లోబల్‌ మేనేజరు కేటీ హర్బత్‌ ఈ మేరకు స్పష్టం చేశారు. ఈసీ వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం.. ఎన్నికల సమయంలో తమ నెట్‌వర్క్‌ ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలు పెట్టే అన్ని అబద్ధపు పోస్ట్‌లను వైరల్‌ కాకుండా నిలువరించేందుకు ఫేస్‌బుక్‌ సమాయత్తమైంది.

 దీనికోసం నిజ నిర్ధరణ తనిఖీ పద్ధతిని వినియోగించేందుకు ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. దీని ద్వారా ఫేస్‌బుక్‌లో ఎవరు ఏ పోస్టులు పెట్టినా, అవి వైరల్‌ అవ్వడానికి ముందు ఓ పరిధి దాటిన తర్వాత స్వీయ నిర్ధరణ వ్యవస్థ పరిధిలోకి వచ్చేస్తాయి. దీంతో వాటిలో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఆ పోస్టులు వైరల్‌ అవ్వడానికి అవకాశం ఉండదు. 

ఒకవేళ ఆ పోస్టులు అవాస్తవాలని, కావాలనే జనాన్ని తప్పుదారి పట్టించడానికి, తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజకీయ పార్టీలు వేసిన ఎత్తుగడలని తేలితే వాటిలో కంటెంట్‌ మొత్తాన్ని ఫేస్‌బుక్‌ తొలగిస్తుంది. లేదా ఇవి అవాస్తవాలు, వీటిని నమ్మొద్దు అంటూ యూజర్లకు సందేశం పంపుతుంది.

Last Updated 7, Jul 2018, 3:00 PM IST