
దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతితో పాటు పలు వివాదాస్పద నిర్ణయాలను తీసుకోవడానికి సిద్దమైంది. తాము అధికారంలో ఉన్న రాష్టాల్లో వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తుంది. ఈ క్రమంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి.. అధ్యయనం చేయించింది. గౌహతి హైకోర్టు రిటైర్డ్ జడ్జి రూమి కుమారి ఫుకాన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను వెల్లడించింది. ఈ అభిప్రాయాల ప్రకారం.. ఇస్లాం ప్రకారం బహుభార్యత్వం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదనీ, అటువంటి ఆచారాన్ని నిషేధించే ఏ చట్టం అయినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(మతాన్ని ఆచరించడం, ప్రచారం చేసే హక్కు)ను ఉల్లంఘించదని పేర్కొంది.
బహుభార్యత్వానికి స్వస్తి పలికే చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్రానికి ఉందా? లేదా? అని అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికలో ముస్లిం పురుషులు నలుగురు స్త్రీలను వివాహం చేసుకునే ఆచారం ఇస్లాంలో ప్రాథమిక మతపరమైన ఆచారం కాదని పేర్కొంది.
ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం.. బహుభార్యత్వం అనుమతించబడుతుంది. కానీ, తప్పనిసరి కాదు.. ప్రతి ముస్లిం పురుషుడు తప్పనిసరిగా నలుగురు భార్యలను కలిగి ఉండాలనేది ఆవశ్యక ఆచారం కాదు. ఇస్లాం ప్రకారం బహుభార్యత్వం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదు. కాబట్టి, అటువంటి ఆచారాన్ని నిషేధించే ఏ చట్టం అయినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (మతాన్ని ఆచరించే, ప్రచారం చేసే హక్కు)ను ఉల్లంఘించదు.” అని కమిటీ పేర్కొంది.
నిపుణుల కమిటీ ప్రకారం.. బహుభార్యత్వం ఆర్టికల్ 14(సమానత్వ హక్కు), 15 (లింగ వివక్షత లేనిది), 21(జీవించే హక్కు)ను ఉల్లంఘించడమేనని పేర్కొంది. వివాహం, విడాకులు ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కాబట్టి రెండు అంశాలపై చట్టాలను రూపొందించడానికి కేంద్రం, రాష్ట్రం రెండూ చట్టబద్ధమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్యానెల్ పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ.. వివాహం,విడాకుల సమస్యలు ముందుగా ఉన్న కేంద్ర చట్టం ద్వారా ఆక్రమించబడినందున రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే దాని అధికార పరిధిలో అమలు చేయబడుతుందని పేర్కొంది.
హిందూ వివాహ చట్టం 1955 అమలులోకి వచ్చిన తర్వాత.. క్రైస్తవులలో క్రిస్టియన్ వివాహ చట్టం 1872, పార్సీల వివాహం,విడాకుల చట్టం 1936 ద్వారా బహుభార్యాత్వం రద్దు చేయబడిందని నిపుణుల కమిటీ పేర్కొంది. ముస్లిం వ్యక్తిగత చట్టాల (షరియత్) చట్టం 1937 కారణంగా ముస్లింలు బహుభార్యత్వం కొనసాగిస్తున్నారని కమిటీ పేర్కొంది.
బహుభార్యత్వం ఆచారం.. పవిత్ర ఖురాన్ యొక్క సూరా 4:3లో ప్రస్తావించబడింది. దీని ద్వారా అనుమతించబడినది. కానీ ప్రోత్సహించబడలేదని కమిటీ ఇస్లామిక్ వ్యక్తిగత చట్టాలపై వివిధ వ్యాఖ్యానాలను సూచించింది. బహుభార్యత్వం ఇస్లాంలో కీలక అంశం కాదని కమిటీ అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ గత వారం తన నివేదికను ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు సమర్పించింది. యూనిఫాం సివిల్‌పై తుది నిర్ణయం తీసుకోని పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కొత్త బహుభార్యత్వ వ్యతిరేక చట్టాన్ని (UCC) తీసుకురావాలని సీఎం బిశ్వ శర్మ చెప్పారు.
జస్టిస్ (రిటైర్డ్) రూమి కుమారి ఫుకాన్ అధ్యక్షతన ఉన్న నిపుణుల కమిటీలో అస్సాం అడ్వకేట్ జనరల్ దేవజిత్ సైకియా, అస్సాం సీనియర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ నలిన్ కోహ్లీ , గౌహతి హైకోర్టు సీనియర్ న్యాయవాది నెకిబుర్ జమాన్ ఉన్నారు. మొత్తానికి బహుభార్యత్వం ఇస్లాం మతం యొక్క ప్రాథమిక ఆచారం కాదనీ, దానిని నిషేధించడం మత స్వేచ్ఛ ఉల్లంఘన కాదని నిపుణుల కమిటీ పేర్కొంది.