ఎన్నికల ఏడాదిలో ఈసీపై నియంత్రణ సాధించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది - కాంగ్రెస్

Published : Aug 11, 2023, 12:14 PM IST
ఎన్నికల ఏడాదిలో ఈసీపై నియంత్రణ సాధించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది - కాంగ్రెస్

సారాంశం

ఎన్నికల సంఘంపై నియంత్రణ సాధించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల ఏడాదిలో సీఈసీ, ఇతర ఈసీల నియామక కమిటీ నుంచి సీజేఐను తొలగించి బిల్లు తీసుకురావడం ఈ వాదనను బలపరుస్తోందని పేర్కొంది. 

ఎన్నికల ఏడాదిలో ఈసీపై పట్టు సాధించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాం రమేష్ ఆరోపించారు. 2012 జూన్ లో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖను ఆయన షేర్ చేస్తూ.. రాజ్యాంగ సంస్థల్లో నియామకాలు ద్వైపాక్షిక పద్ధతిలో జరగాలని తాను కూడా చెప్పానని గుర్తు చేశారు. 

ఎన్నికల సంఘం సభ్యుల నియామకాల్లో ప్రభుత్వానికి మరింత నియంత్రణ ఉండేలా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో క్యాబినెట్ మంత్రిని నియమించే వివాదాస్పద బిల్లును కేంద్రం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలతో కూడా అద్వానీ ఆ సమయంలో ఒక ప్యానెల్ ను ప్రతిపాదించారని రమేష్ తెలిపారు.

‘‘ ప్రస్తుత ప్రతిపాదిత సీఈసీ బిల్లులో 2:1 నిష్పత్తిలో కార్యనిర్వాహక జోక్యం ఉండేలా చూస్తారు. ఎన్నికల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇది రావడం.. ఎన్నికల కమిషనర్ పై నియంత్రణను సాధించాలనే మోడీ కోరుకుంటున్నారనే అభిప్రాయాన్ని మరింత బలపరుస్తుంది’’ అని కాంగ్రెస్ నాయకుడు ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎల్ కే అద్వానీ మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖలోని పలు పేరాలను జైరాం రమేష్ ప్రస్తావించారు. ‘‘పక్షపాతం లేదా పారదర్శకత, నిష్పాక్షికత లోపించిందనే అభిప్రాయాన్ని తొలగించడానికి ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థల నియామకాలు ద్వైపాక్షిక ప్రాతిపదికన జరగాలనే అభిప్రాయం దేశంలో వేగంగా పెరుగుతోంది’’ అని అందులో పేర్కొన్నారని జైరాం రమేష్ తెలిపారు. 

ఇది మోడీపై విమర్శ కాదని, 2012 జూన్ 2న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అద్వానీ రాసిన లేఖలోని రెండో పేరాలోని సారాంశం అని, కావాలంటే దీనిని బీజేపీ వెబ్ సైట్ లో చూడవచ్చని జైరాం రమేష్ పేర్కొన్నారు. సీఈసీ, ఎన్నికల కమిషనర్‌లను ఎంపిక చేయడానికి ఎల్ కే అద్వాని ప్రతిపాదించిన కమిటీలో సీజేఐతో పాటు పార్లమెంటు ఉభయసభలకు చెందిన ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. 

అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సీఈసీ బిల్లు అద్వానీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా.. 2023 మార్చి 2వ తేదీన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేస్తోందని జైరాం రమేష్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు