బీజేపీ నేత కారులో ఈవీఎం: 149 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్

By narsimha lodeFirst Published Apr 2, 2021, 4:16 PM IST
Highlights

అసోం రాష్ట్రంలోని రాతబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక్క పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ కు శుక్రవారం నాడు ఈసీ ఆదేశించింది.

గౌహతి:అసోం రాష్ట్రంలోని రాతబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక్క పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ కు శుక్రవారం నాడు ఈసీ ఆదేశించింది.

బీజేపీకి చెందిన నేత కారులో ఈవీఎం తరలిస్తున్నట్టుగా ఓ వీడియో గురువారం నాడు సోషల్ మీడియాలో వైరల్ గామ మారింది. ఈ విషయమై అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకొంది. మరోవైపు ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ నలుగురు ఎన్నికల అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది.

కరీంగంజ్ జిల్లాలో చోటు చేసుకొన్న ఘటన హింసకు దారితీసింది.  బీజేపీ అభ్యర్ధి కృష్ణేందు పాల్ భార్యకు చెందిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుకు ఈ ఘటన అద్దం పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.అసోంలో గురువారం నాడు రెండో విడత పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.రెండో విడతలో 77 శాతం పోలింగ్ నమోదైంది.

రతబరీలోని ఇందిరా ఎంవీ స్కూల్ లో  ఈవీఎంలను ఈసీ కేటాయించిన వాహనంలో తరలిస్తున్న సమయంలో వాహనం పాడైంది. ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు మరో వాహనం పంపాలని కోరాడు.అయితే రాత్రి 9:20 గంటలకు  ఈవీఎంను ఓ ప్రైవేట్ కారులో తరలించారు.  అయితే ఈ కారు కృష్ణేందు పాల్  భార్య   మధుమితదిగా ఆ తర్వాత గుర్తించారు. 

ఈ వాహనంలో ఈవీఎంను రాత్రి 10 గంటల సమయంలో తరలించారు. ఈ వాహనాన్ని గుర్తించిన విపక్ష పార్టీల మద్దతుదారులు  డ్రైవర్ తో పాటు ఈవీఎంను పట్టుకొన్నారు. కారుపై రాళ్లతో దాడి చేశారు. జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు.  ఈవీఎంను సురక్షితంగా  స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు.ఈవీఎంలోని వీవీప్యాట్ తో  పాటు సీల్ చెక్కు చెదరలేదని అధికారులు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు.

ఈ విషయమై ఎన్నికల అధికారులకు అందిన  ఫిర్యాదుల మేరకు 149 పోలింగ్ స్టేషన్ లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకొంది. పోలింగ్ బూత్ లను బీజేపీ ఆక్రమించిందని  చెప్పడానికి ఈ ఘటనను విపక్షాలు ఉదహరించాయి. 

click me!