IndependenceDay 2023: 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో భారత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందని ప్రధాని అన్నారు.
Prime Minister Narendra Modi: అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తల వల్లే 200 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ల పంపిణీ సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. భారత వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థాయిని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందని అన్నారు. "కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న విధానంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచం చూసింది. మానవ కేంద్రీకృత విధానం లేకుండా ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని మహమ్మారి నేర్పింది. ఇతర దేశాల సరఫరా గొలుసులు దెబ్బతిన్నప్పుడు, ప్రపంచ పురోగతిని నిర్ధారించడానికి మేము మానవ కేంద్రీకృత విధానాన్ని సూచించాము" అని ఆయన అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అనేది ప్రస్తుత డిమాండ్ అనీ, తమ ప్రభుత్వం ప్రత్యేక ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసిందనీ, ఇప్పుడు ప్రపంచం ఆయుష్, యోగాను గమనిస్తోందని ఆయన అన్నారు. తమ నిబద్ధత వల్లే ఇప్పుడు ప్రపంచం మమ్మల్ని గమనిస్తోందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్-19 అనంతర కాలంలో భారత్ విశ్వ మిత్ర (ప్రపంచానికి మిత్రుడు)గా అవతరించిందని అన్నారు. "కోవిడ్ తర్వాత 'వన్ ఎర్త్, వన్ హెల్త్' విధానాన్ని భారత్ సమర్థించింది. వ్యాధుల విషయంలో మనుషులు, జంతువులు, మొక్కలను సమానంగా సంబోధించినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి" అని తెలిపారు. దేశంలో సార్వత్రిక ఆరోగ్య కవరేజీని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, బీపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య హామీ అందించడానికి ఆయుష్మాన్ భారత్ పథకంలో ₹70,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆయన చెప్పారు.
ఎర్రకోటపై నుంచి వేడుకలను తిలకించేందుకు, వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 50 మంది నర్సులను, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులను సైతం ఆహ్వానించారు. 'ఒకే భూమి, ఒకే ఆరోగ్యం, ఒకే భవిష్యత్తు' అనే దార్శనికతను ప్రస్తావిస్తూ, జన్ ఔషధి కేంద్రాలు రూ.20,000 కోట్ల పొదుపు ద్వారా దేశంలోని మధ్యతరగతికి కొత్త బలాన్నిచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో జన ఔషధి కేంద్రాల సంఖ్యను పది వేల నుంచి 25 వేలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు. అందరికీ అందుబాటు ధరల్లో జనరిక్ మందులు అందుబాటులోకి తెచ్చేందుకు 'జన ఔషధి కేంద్రాలు' ఏర్పాటు చేశామని తెలిపారు.