
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరుణ్ రామచంద్రపిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఎదుట ప్రవేశపెట్టింది . ఈ సందర్భంగా ఈడీ పలు అభియోగాలు మోపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతినిధిగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు పేర్కొంది. లిక్కర్ స్కాంలో విచారణకు సైతం సహకరించడం లేదని ఈడీ ఈరోపిస్తోంది. ఇండో స్పిరిట్‌లో రామచంద్రపిళ్లై భాగస్వామిగా వుండటంతో పాటు .. సమీర్ మహేంద్రుతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని ఈడీ కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
రెండు రోజులుగా ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు రాత్రి అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్ చేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మంది అరెస్టయ్యారు. లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు తొలుత అరుణ్ రామచంద్ర పిళ్లైపై అభియోగాలు నమోదు చేశారు. ఈ విషయమై హైద్రాబాద్ కేంద్రంగా పలు దఫాలు సోదాలు నిర్వహించారు. అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పిళ్లైకి చెందిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్డ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.. హైద్రాబాద్ శివారులోని రెండు కోట్ల విలువైన భూమిని ఈడీ అధికారులు అటాచ్డ్ చేస్తున్నట్టుగా తెలిపింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ను ఇటీవలనే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియా తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలు వివేక్ , బండి సంజయ్ కూడా పలుమార్లు కవిత అరెస్ట్ తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం చార్జీషీట్‌లో కవిత పేరును కూడా ప్రస్తావించింది ఈడీ.
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకు పంపిస్తే నేనేం చేస్తానంటూ ఆమె ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసుకు తాను భయపడనని.. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరకు వెళ్తానని కవిత తేల్చిచెప్పారు. తానేమి ఫోన్లు ధ్వంసం చేయలేదని.. సీబీఐ అడిగితే ఇస్తానని కవిత తెలిపారు. రూ.130 కోట్ల లంచం అనేది తనకు తెలియదని.. ఈ కేసును ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఏపీలో బీఆర్ఎస్‌కు ఏ పార్టీ ఫేవర్ కాదని.. కేటీఆర్‌ను సీఎం చేయడానికే బీఆర్ఎస్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత ఖండించారు.
ALso Read: అవినీతి సొమ్ముతో ఢిల్లీలో 600 మద్యం షాపులు.. ఎమ్మెల్సీ కవిత అరెస్టవ్వడం ఖాయం... కోమటిరెడ్డి...
లిక్కర్ స్కాంలో తాను చేసిందేమి లేదని.. ఆరుగంటలు సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని ఆమె వెల్లడించారు. బీజేపీ అసలు టార్గెట్ తాను కాదని కేసీఆర్ అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి తాను ఏం చేశానో వాళ్లే చెప్పాలని చురకలంటించారు. బీఆర్ఎస్‌లో మిగిలిన లీడర్‌ల లాగే ఈ కేసులో కేసీఆర్ తనకు సలహాలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో విచారణకు సహకరిస్తానని.. ఈ కేసుకు సంబంధించి సీరియస్ ఆరోపణలు సరికాదన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తానా లేదా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు కవిత. కాంగ్రెస్‌తో పొత్తు అనేది అప్పటి పరిస్ధితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. పవన్‌కు బీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఆఫర్ చేసిందనేది నిజం కాదని కవిత ఖండించారు. అలాగే బీజేపీ మేలు కోసమే బీఆర్ఎస్ పెట్టారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.