ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాకు మూడో సారి పొడిగింపును మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వలను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ విధమైన పొడిగింపు 2021 నాటి సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని కోర్టు తెలిపింది. ఇది చట్టవిరుద్దమని స్పష్టం చేసింది. అయితే జూలై 31 వరకు సంజయ్ కుమార్ మిశ్రా తన పదవిలో కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది. ఈడీ ప్రస్తుత డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించడాన్ని సవాలు చేస్తూ, కేంద్ర విజిలెన్స్ కమిషన్ చట్టానికి ఇటీవల చేసిన సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ల బ్యాచ్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
పిటిషనర్లలో కాంగ్రెస్ నేతలు జయ ఠాకూర్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఉన్నారు. పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. మే నెలలో బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తాజాగా తీర్పును వెలువరించిన ధర్మాసం.. ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాకు మూడోసారి పొడిగింపును మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును చట్టవిరుద్ధం పేర్కొంది. సంజయ్ కుమార్ మిశ్రా పదవీ విరమణకు కోర్టు జూలై 31 వరకు గడువు ఇచ్చింది.
అదే సమయంలో సీబీఐ చీఫ్ మరియు ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని వారి తప్పనిసరి రెండేళ్ల కాలానికి మించి మూడేళ్లపాటు పొడిగించే అధికారాన్ని కేంద్రానికి ఇచ్చే.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టంలో సవరణలను అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. చట్టంపై న్యాయ సమీక్ష పరిధి చాలా పరిమితం అని కోర్టు పేర్కొంది.
ఇక, ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని పొడిగించే చట్టాన్ని రూపొందించడానికి లేజిస్లేచర్‌కు అధికారం ఉన్నప్పటికీ.. మిశ్రాకు ఇచ్చిన పొడిగింపు 2021లో సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం.. 2021 నవంబర్ తర్వాత మిశ్రాకు పొడిగింపులు ఉండకూడదు.
కేసు నేపథ్యం
సంజయ్ కుమార్ మిశ్రా మొదటిసారిగా ఈడీ డైరెక్టర్‌గా 2018 నవంబర్‌లో రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఈ పదవీకాలం 2020 నవంబర్‌లో ముగిసింది. 2020 మేలో అతను పదవీ విరమణ వయస్సు 60కి చేరుకున్నాడు. అయితే 2020 నవంబర్ 13న.. రెండేళ్ల కాలాన్ని మూడేళ్ల కాలానికి మార్చే విధంగా రాష్ట్రపతి 2018 ఉత్తర్వును సవరించినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఆఫీసు ఆర్డర్ జారీ చేసింది. దీనిని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు 2021 సెప్టెంబర్ నాటి తీర్పులో.. సవరణను ఆమోదించింది. అయితే సంజయ్ కుమార్ మిశ్రాకు మరిన్ని పొడిగింపులను మంజూరు చేయడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. 2021లో కోర్టు నిర్ణయం తర్వాత.. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అధికారాన్ని ఇచ్చింది.
ఆ తర్వాత ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని గరిష్టంగా 5 సంవత్సరాలకు లోబడి ఒకేసారి ఒక సంవత్సరం పాటు పొడిగించడానికి అనుమతిస్తూ పార్లమెంటు దీనికి సంబంధించి ఒక చట్టాన్ని ఆమోదించింది. అయితే దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో జరిగిన విచారణలో పిటిషనర్ల రాజకీయ అనుబంధాలతో తమకు సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.