
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఘన విజయంతో కొత్త జోష్‌ను నింపుకున్నది. కర్ణాటకలో తన ఓటర్లను ఏకం చేసుకుంది. అదనంగానూ చేర్చుకుంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ తన ఓటర్లను మూటగట్టుకోవడం.. ఓటు బ్యాంకును పెంచుకోవడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్తాన్ రాష్ట్రాలపై దృష్టి సారించింది. తద్వార 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లను తన వైపు తిప్పుకుని కేంద్రంలో గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే పై నాలుగు రాష్ట్రాల నేతలతో మల్లికార్జున్ ఖర్గే మే 24వ తేదీన సమావేశం కాబోతున్నారు. ఖర్గే అధ్యక్షతలో ఆ భేటీ జరుగుతుందని కొన్ని వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలో విజయాన్ని నమోదు చేసుకున్నా.. సీఎం సీటు గురించి ఇద్దరు అగ్ర నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ మనం చూశాం. మరో వైపు రాజస్తాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య వైరం వీధికెక్కింది. పార్టీ అంతర్గత కుమ్ములాటలను ఎక్కువగా ఎదుర్కొంటున్నది. వీటినీ పరిష్కరించే యోచనలో కాంగ్రెస్ ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ ఇంచార్జీ సుఖ్‌జిందర్ సింగ్ రాంధవా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసమ్మతిదారులను బహిష్కరించబోమని, కానీ, గతంలో అలా చేసిన వారి పరిస్థితి ఎలా ఉన్నదో మాత్రం గుర్తు చేస్తామని వివరించారు.
మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన 15 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైంది. సింధియా వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు బీజేపీ టికెట్ పై గెలవడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో సుమారు గత రెండు దశాబ్దాలుగా బీజేపీ ప్రభుత్వమే ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్‌తో పోటీ పడుతున్నది. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడానికి ఈ పరిణామం ఆటంకిగా మారుతున్నది.