
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. ‘‘నాన్న.. మీరు నాతో ఉన్నారు.. స్ఫూర్తిగా, జ్ఞాపకంలో ఎప్పటికీ!’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీకి సంబంధించిన వివిధ క్షణాలతో కూడిన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.
ఇక, నేడు రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని వీర్ భూమిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పూలమాల వేసి నివాళులర్పించారు.కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగాఆదివారం ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
ఇక, 1984లో తన తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్‌లో ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయసు 40 ఏళ్లు. దీంతో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఆయన 1989 డిసెంబర్ 2 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు. అయితే 1991లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌కు వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ ఉగ్రవాదులు హత్య చేశారు.