
దేశ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా, కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలలో, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనని 334 పార్టీలను రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించింది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నమోదు చేసిన పార్టీలు ఆరు సంవత్సరాల వ్యవధిలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాలి. అయితే, ఈ 334 పార్టీలు 2019 నుంచి ఎటువంటి ఎన్నికల్లోనూ పాల్గొనకపోవడంతో ఈసీ ఈ చర్యలు చేపట్టింది.
తాజా నిర్ణయంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 5 పార్టీలు, తెలంగాణకు చెందిన 13 పార్టీలు జాబితా నుంచి తొలగించారు. వీటిలో చాలా పార్టీలు పేరుకే ఉండి, ఎలాంటి కార్యాలయాలు లేదా కార్యకలాపాలు జరపడం లేదని ఈసీ పేర్కొంది.
ఇప్పటివరకు దేశంలో గుర్తింపు లేని 2,854 పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యాయి. తాజా వేటుతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు మాత్రమే చురుకుగా కొనసాగుతున్నాయి.
ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం, ఈ చర్యల ఉద్దేశ్యం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, అవినీతి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడంలో ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.