
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో 2022 జూన్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి సుమారు 15 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలపడం అప్పుడు సంచలనమైంది. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలవాలని లేదంటే.. తాము బీజేపీలో కలుస్తామని అల్టిమేటం విధించారు. వారు బీజేపీ రాష్ట్రాలకు చెక్కేయడం, గవర్నర్ ఫ్లోర్ టెస్ట్‌కు పిలుపునివ్వడం, ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడం, ఆ తర్వాత బీజేపీతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేతులు కలపడం చకచకా జరిగిపోయాయి.
తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని శివసేన అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించి ఈ రోజు తీర్పు వెల్లడించింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఎలాంటి గుర్తింపు లేకున్నా.. ఆ నేతల్లో ఒకరికి విప్ అప్పగించడం స్పీకర్ చేసిన తప్పు అని, పార్టీ అంతర్గత సమస్య అని తెలుస్తున్నా ఫ్లోర్ టెస్టుకు ఆదేశించడం గవర్నర్ తప్పు అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తప్పులున్నప్పటికీ ఫ్లోర్ టెస్టును ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది.
ఏక్‌నాథ్ షిండే, మరో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను తాము డిస్‌క్వాలిఫై చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విస్తృత ధర్మాసనం విచారణ చేస్తుందని, అప్పటి వరకు ఆ అధికారం స్పీకర్ చేతిలోనే ఉంటుందని వివరించింది.
Also Read: మహా సంక్షోభం: ఉద్దవ్‌ను సీఎంగా పునరుద్దరించలేమన్న సుప్రీం కోర్టు.. షిండే సర్కార్‌కు ఊరట..
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని, ఆయన ఫ్లోర్ టెస్టు ఎదుర్కోకుండా రాజీనామా చేశారని సుప్రీంకోర్టు తెలిపింది. కాబట్టి, లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని వివరించింది.
గవర్నర్ చట్టవిరుద్ధ నిర్ణయం ద్వారానైనా ఏక్‌నాథ్ షిండే మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఈ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకపోవడం షిండే వర్గానికి పెద్ద ఊరటనిచ్చినట్టయింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని చెప్పడంతో షిండే ప్రభుత్వమే కొనసాగనుంది.
ఒక వేళ తిరుగుబాటు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటిస్తే అప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్సీపీతో చేతులు కలిపే ప్రయత్నం చేసేది. అందుకే ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఈ మధ్య దూకుడుగా కనిపించారు. అవసరమైతే ఎన్నికలు రాకముందే సీఎం కాగలనని ఆయన అనడం ఈ కోణాన్ని బయటకు తెచ్చింది. అందుకే ఎన్సీపీ, బీజేపీల మధ్య లోపాయికారిగా ఒక ఒప్పందం కుదిరిందనే వదంతలు బయటకు వచ్చాయి. కానీ, షిండే వర్గంపై అనర్హత వేటు పడకపోవడంతో ఇక ఎన్సీపీ, బీజేపీల మధ్య దోస్తీ అనే వదంతులకూ చెక్ పడ్డట్టయింది.