ఆస్పత్రిలోనే మహిళా డాక్టర్ హత్య.. కేరళలో రెండో రోజు విధులకు దూరంగా వైద్యులు.. !!

Published : May 11, 2023, 01:56 PM IST
ఆస్పత్రిలోనే మహిళా డాక్టర్ హత్య.. కేరళలో రెండో రోజు విధులకు దూరంగా వైద్యులు.. !!

సారాంశం

కేరళలోని కొల్లాం జిల్లాలో మహిళా వైద్యురాలు వందన దాస్ హత్య ఘటనపై నిరనసలు కొనసాగుతున్నాయి. 

కేరళలోని కొల్లాం జిల్లాలో మహిళా వైద్యురాలు వందన దాస్ హత్య ఘటనపై నిరనసలు కొనసాగుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సహా వివిధ సంస్థలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గత 24 గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మెజారిటీ డాక్టర్లు విధులు నిర్వర్తించడం లేదు. ఆసుపత్రుల రక్షణకు కొత్త చట్టం తీసుకురావాలని వైద్యులు గురువారం డిమాండ్ చేశారు. కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ (కేజీఎంఓ) కూడా సమ్మెను ప్రకటించింది.

అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఆందోళన కారణంగా రాష్ట్ర ఆసుపత్రులలో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ప్రభావితం అవుతున్నాయి. డ్యూటీలో ఉన్న వైద్యులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులను ప్రత్యేక రక్షణ జోన్‌లుగా ప్రభుత్వం ప్రకటించాలని ఆందోళన  చేస్తున్న డాక్టర్లు కోరుతున్నారు. 

ఇదిలా ఉంటే.. హత్యకు గురైన వైద్యురాలు వందన దాస్‌ భౌతికకాయాన్ని కొట్టాయంలోని ముట్టుచిరలోని ఆమె నివాసానికి తరలించారు. ఆమె భౌతికకాయానికి పలువురు ప్రజాప్రతినిధులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు,  ప్రజలు నివాళులర్పించారు. వందన దాస్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఉన్నారు.

అసలేం జరిగిందంటే.. 
కొట్టాయంకు చెందిన 23 ఏళ్ల వందన దాస్.. కొట్టారకర తాలూకా ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. అయితే నెడుంబన‌లో టీచర్‌గా పనిచేస్తున్న సందీప్‌ తన ఇంటి వద్ద గొడవ పడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ జరిగిన గొడవలో సందీప్‌కు గాయాలు కావడంతో తెల్లవారుజామున కొట్టారకరలోని తాలూకా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ సందీప్ కాలుకు గాయానికి వందన డ్రెస్సింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే సందీప్ ఒక్కసారిగా వందనపై దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్సకు ఉపయోగించే పరికరాలతో విరుచుకుపడ్డాడు. కత్తెర‌, ఇతర పరికరాలతో వందనపై ఐదుసార్లు పొడిచాడు. ఆసుపత్రిలో ఉన్న వారిని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వందనను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో పరిస్థితి విషమించడంతో వందన కన్నుమూసింది. 

వందన హత్యపై ప్రభుత్వ పెద్దలతో పాటు కేరళ హైకోర్టు కూడా  దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటన పోలీసు, ప్రభుత్వ వైఫల్య ఫలితమని కేరళ హైకోర్టు పేర్కొంది .ఈ సంఘటనకు సంబంధించిన నివేదికను ఇవాల్సిందిగా రాష్ట్ర పోలీసు చీఫ్‌ను కోరింది.  

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్