మహారాష్ట్ర: అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ షాక్‌.. రూ. 4 కోట్లు ఆస్తుల జప్తు

By Siva KodatiFirst Published Jul 16, 2021, 5:28 PM IST
Highlights

అవినీతి ఆరోపణల కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు సంబంధించి 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్‌ ఇచ్చింది. మనీ లాండరింగ్‌ కేసులో భాగంగా అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. అయితే బహిరంగ మార్కెట్‌లో జప్తు చేసిన ఆస్తుల విలువు సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం.

అనిల్‌ దేశ్‌ముఖ్ ఈడీ దర్యాప్తుకు హాజరు కాకుండా ఇప్పటికే మూడు సార్లు తప్పించుకున్నారు. అటు ఆయన కుమారుడు హృషికేశ్, భార్యకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ వారు కూడా దర్యాప్తుకు నిరాకరించారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్‌ సింగ్ ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Also Read:మహారాష్ట్ర: అనిల్ దేశ్‌ముఖ్‌ను వీడని కష్టాలు.. మూడోసారి ఈడీ నోటీసులు

ఈ మేరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్ తన పదవీకి రాజీనామా చేశారు. మరోవైపు తనపై వచ్చిన ఈ ఆరోపణలను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు. ఈ క్రమంలో ఆయన, ఈడీ బలవంతపు చర్యల నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 

click me!