యూపీ ఎన్నికలకు ఒమిక్రాన్ ముప్పు? కరోనా కట్టడి చర్యల వివరాలు అడిగిన ఈసీ

By Mahesh KFirst Published Dec 22, 2021, 10:48 PM IST
Highlights

వచ్చే ఏడాది తొలినాళ్లలో యూపీ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఒకవైపు కరోనా కేసులు పెరగడం.. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ఎన్నికల నిర్వహణపై సాధారణ ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్‌కు ఓ లేఖ రాసింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడి చేయడానికి యూపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నదని? ఎన్ని కేసులు ఉన్నాయని, టీకా పంపిణీ తీరును వివరించాలని ఆదేశించింది. 
 

లక్నో: కరోనా వైరస్(Corona Virus) సెకండ్ వేవ్(Second Wave) దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు ప్రాణవాయువు కోసం అల్లాడిపోయారు. కుప్పలుగా మృతదేహాలు.. అంతిమ సంస్కారాలకూ శ్మశానాలు ఫుల్ అయిన దుర్భర దృశ్యాలను చూశాం. గంగ పరివాహకంలో శవాల దిబ్బలు ఉత్తరప్రదేశ్‌లో సెకండ్ వేవ్ బీభత్సాన్ని స్పష్టం చేశాయి. సెకండ్ వేవ్ తగ్గిపోయాక కేసులు తగ్గాయి. కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, అదే మహమ్మారి మరోసారి ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పంజా విసురుతున్నది. ఈ తరుణంలోనే వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభిస్తే.. జనవరి లేదా ఫిబ్రవరిల్లో వేవ్ పీక్ స్టేజ్‌లో ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటి సందర్భంలో కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ తీసుకుంటున్న చర్యలు వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. యూపీలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. టీకా పంపిణీ వివరాలను వెల్డించాల్సిందిగా పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో ఎన్ని కన్ఫామ్‌డ్ కేసులు ఉన్నాయో వివరించాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఈ ఎన్నికల తుది తేదీలను ఎలక్షన్ కమిషన్ జనవరి మూడో వారంలో వెలువరించవచ్చు. జనవరి నుంచి మార్చి మధ్యలో ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.

Also Read: తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా 14 కేసులు, 38కి చేరిన బాధితుల సంఖ్య

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 216 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈసీ లేఖపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తాము 2020, 2021లోనే సిద్ధమై ఉన్నామని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్లు, వైద్యులు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఐసీయూలు, బెడ్ల వసతి, వైద్య సిబ్బంది అన్ని సంసిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్లా తాము జాగ్రత్తగా ఉన్నామని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కరోనా టీకాల పంపిణీ వేగవంతం చేశామని తెలిపారు. గ్రామాల్లోనూ పని చేసే ప్రాంతాలకు వెళ్లి అధికారులు టీకాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్నీ ఈసీకి ఓ లేఖలో వివరించామని పేర్కొన్నారు.

Also Read: తెలంగాణ: 24 గంటల్లో 182 మందికి పాజిటివ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు

ఈ నేపథ్యంలో ఎన్నికల ఒమిక్రాన్ వేరియంట్ కట్టడి చర్యలు.. కరోనా కేసులు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగడంతో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిలిపేసే యోచన ఈసీ చేస్తున్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో కరోనా కేసులు అధికంగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే సమయంలో సెకండ్ వేవ్ కారణంగా దేశంలో భీకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో సెకండ్ వేవ్ విలయం సృష్టించింది. ఈ వేవ్ నుంచి కొంచెం బయటపడగానే.. అంటే కేసులు కొన్ని తగ్గుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఏకంగా ఎనిమిది దశల్లో ఎన్నికల కమిషన్ నిర్వహించింది.

click me!