
శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే బిక్రమ్ సింగ్ మజిథియాపై (Bikram Singh Majithia) బుధవారం లుక్ ఔట్ నోటీస్ (Lookout Notice) జారీ చేసింది. గతంలోని ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైన మరుసటి రోజే కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) ఈ నిర్ణయం తీసుకుంది. బిక్రమ్ సింగ్ శిరోమణి అకాలీదళ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్‌కు మజిథియా సోదరుడు. ఆయన గతంలో పంజాబ్ మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే ఆయనపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్) కింద కేసు నమోదైంది. అయితే ఆయన పార్టీ నేతలు మాత్రం దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాన్ని అకాలీదళ్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
యాంటీ డ్రగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) చీఫ్ హర్‌ప్రీత్ సింగ్ సిద్ధూ.. రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్‌పై దర్యాప్తు జరిపి నివేదిక రూపొందించారు. 2018లో హర్‌ప్రీత్ సింగ్ సిద్దూ పంజాబ్, హర్యానా హైకోర్టులో ఈ నివేదికను దాఖలు చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధారంగా బ్రికమ్ సింగ్ మజిథియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనపై ఎన్డీపీఎస్ చట్టంలోని 25, 27ఎ, 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసు అధికారులు పంజాబ్ అడ్వొకేట్ జనరల్ నుంచి లీగల్ ఓపినియన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణాను సులభతరం చేయడానికి ప్రభుత్వ వాహనాలు, భద్రత, అధికారిక సిబ్బందిని దుర్వినియోగం చేశారని బిక్రమ్ సింగ్ మజిథియాపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే బిక్రమ్ సింగ్ మజిథియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందించారు. ప్రభుత్వం సరైన ప్రక్రియను అనుసరింలేదని.. బిక్రమ్ సింగ్ మజిథియాపై నమోదైన కేసు చట్టపరమైన పరిశీలనకు నిలబడదని అన్నారు.
ఇందుకు సంబంధించి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్న వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని సిద్ధూ పేర్కొన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసును పట్టించుకోలేదని సిద్ధూ ఆరోపించారు. తాను మాత్రం పోరాడుతూనే ఉన్నానని చెప్పారు.