మూగ, చెవిటి బాలికపై నలుగురు మైనర్లు సహా ఆరుగురు గ్యాంగ్ రేప్.. ఆ ఫొటోలే లేకుంటే..?

By telugu teamFirst Published Oct 1, 2021, 3:21 PM IST
Highlights

మధ్య్రప్రదేశ్‌లో ఓ మూగ, చెవిటి బాలికపై నలుగురు మైనర్లు, మరో ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. మూగ, చెవిటి బాలిక కదా.. విషయం బయటపడే ఛాన్సే లేదని అనుకున్నారు. కానీ, ఆ ఘటనకు సంబంధించి వారు తీసిన ఫొటోలే వారిని పట్టించాయి. బాలిక ఘటనను చేతి సంకేతాలతో వివరించి, ఆ ఫొటోల్లోని వారిని గుర్తించింది. అంతే.. ఆ ఆరుగురినీ పోలీసులు అరెస్టు చేశారు.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మూగ, చెవిటి బాలికపై నలుగురు మైనర్లతోపాటు మరో ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. ఇలాంటి అఘాయిత్యాలు చేసే దుండగులు బలహీనులనే లక్ష్యంగా చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. మూగ, చెవిటి బాలికపై గ్యాంగ్ రేప్ చేసినా విషయం బయటికి పొక్కదని నిందితులు భావించి ఉండవచ్చు. కానీ, వారి వికృతచేష్టలు పరాకాష్టకు చేరి లైంగికదాడిని ఫొటోలు కూడా తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ ఫొటోలే దుండగులను పట్టించడంలో కీలక పాత్ర పోషించాయి. 

ఈ గ్యాంగ్ రేప్ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. మూగ, చెవిటి బాలిక పొరుగున ఉండే ఇద్దరు ఆమెను పథకం ప్రకారం ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఊరి శివారులోని ఓ గుడిసె దగ్గరకు ఆమెను తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు వీరి కోసం ఎదురుచూస్తున్నారు.

ఆ ఆరుగురు బాలికపై లైంగికదాడికి ప్రయత్నించారు. కానీ, ఆమె ప్రతిఘటించింది. బాలిక ప్రతిఘటించడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆమెపై దాడి చేసి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అనంతరం, ఆమెను వదిలి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. బాలిక కూడా ఈ ఘటన గురించి ఇంటి దగ్గర చెప్పలేకపోయింది.

ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలను నిందితులు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీటిని ఓ యువకుడు చూసి బాధితురాలిని గుర్తుపట్టాడు. అదే విషయాన్ని బాధితురాలి తండ్రికి తెలిపాడు. ఆ ఫొటోగ్రాఫ్‌లనూ బాలిక తండ్రీ పరిశీలించి.. కూతురిని ఆరా తీశాడు. ఈ విషయం అడగ్గానే బాలిక కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉండిపోయింది. చివరికి చేతి సంజ్ఞలతో ఘటనను వివరించే ప్రయత్నం చేసింది.

ఘటన గురించి అర్థం చేసుకున్న వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. బాలిక తల్లి ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఎస్పీ అవదేశ్ గోస్వామి తమకు గురువారం ఫిర్యాదు అందిందని చెప్పారు. బాలిక నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి సోషల్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ నుంచి నిపుణులు రంగంలోకి దిగారని వివరించారు. బాలిక ఆ ఘటనను చేతి సంకేతాలతో వివరించిందని, ఫొటోల్లోని నిందితులను గుర్తించిందని తెలిపారు. నలుగురు మైనర్లు సహా ఆరుగురు నిందితులనూ అరెస్టు చేసినట్టు వివరించారు.

click me!