జమ్ము సైనిక స్థావరాల వద్ద మళ్లీ డ్రోన్లు... 4 రోజుల్లో 7 సార్లు...

By AN TeluguFirst Published Jun 30, 2021, 10:58 AM IST
Highlights

జమ్మూ కశ్మీర్ లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం జమ్ము సైనిక స్థావరాలకు సమీపంలో మరో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు.  నిన్న అర్ధరాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని డ్రోన్లు సంచరించాయి.

జమ్మూ కశ్మీర్ లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం జమ్ము సైనిక స్థావరాలకు సమీపంలో మరో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించారు.  నిన్న అర్ధరాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని డ్రోన్లు సంచరించాయి.

మొదట కాలుచూక్ కంటోన్మెంట్ వద్ద ఓ డ్రోన్ కనిపించగా... ఆ తర్వాత కాసేపటికే రత్నచక్ సైనిక ప్రాంతంలో మరో దాన్ని గుర్తించారు. ఇక మూడోది కుంజ్వానీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద కనిపించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.  డిఫెన్స్ ఇన్ ష్టాలేషన్స్ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా... జమ్ము సైనిక స్థావరాల వద్ద గత నాలుగు రోజుల్లో మొత్తం ఏడు డ్రోన్లు సంచరించడం గమనార్హం.   గత ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భవనంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన విషయం తెలిసిందే.

ఆరు నిమిషాల వ్యవధిలో ఈ రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో భవనం పైకప్పుకు రంధ్రం పడింది. కాగా, ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జమ్మూలోని మరో సైనిక స్థావరంపై దాడి ని సైన్యం భగ్నం చేసింది. రత్నచక్, కాలూచక్ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11,45 గంటలకు ఒక డ్రోన్, అర్థరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్ తిరిగాయి.

రెండూ క్వాడ్ కాప్టర్ లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకున్నాయి. వరుసఘటనల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

మరోవైపు డ్రోన దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉంచొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మన సైనిక స్థావరాలమీద ఉగ్రవాదులు డ్రోన్లతో దాడుకలు దిగడం ఇదే ప్రథమం. సరిహద్దు ఆవల నుంచి ఉత్పన్నమైన ఈ సరికొత్త ముప్పుతో అప్రమత్తమైన కేంద్రం తాజా పరిస్థితిని సమీక్షించింది.

ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ తో భేటీ అయ్యారు. దేశ భద్రతకు ఏర్పడే కొత్త సవాళ్లను దృఢంగా తిప్పి కొట్టేందుకు సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. 

click me!