ఢిల్లీ: ఇండియా-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా ఓ సందేశం భారీగా వైరల్ అయ్యింది. అందులో, ఫోన్‌లలో లొకేషన్ సర్వీసులు కొనసాగిస్తే, డ్రోన్లు వాటిని ట్రాక్ చేసి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించగలవన్న విషయం ఉంది. అందువల్ల వెంటనే లొకేషన్ ఆఫ్ చేయాలంటూ ప్రజలకు హెచ్చరికలు వస్తున్నట్టు చెప్పబడింది.ఈ మెసేజ్ చాలా మందిని ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అప్రమత్తత అవసరమన్న భావనతో చాలా మంది దీనిని నిజమని నమ్మారు. అయితే ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ సందేశాన్ని పరిశీలించి, ఇది పూర్తిగా వదంతి మాత్రమేనని స్పష్టం చేసింది. ఇలాంటి హెచ్చరికలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఇవ్వలేదని, డ్రోన్లు ఫోన్ లొకేషన్ ఆధారంగా జనసాంద్రతను గుర్తిస్తాయన్న వార్తకు ఎలాంటి ఆధారమూ లేదని PIB తెలిపింది.అంతేకాదు, పాకిస్తాన్‌కు అనుకూలంగా సాగుతున్న సోషల్ మీడియా ప్రచారాల్లో భాగంగా ఇలాంటి వదంతులు కావచ్చన్న హెచ్చరికను కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో దేశ రక్షణ, సైనిక సమాచారం, ప్రజల భద్రత వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదమైన సమాచారం ఏదైనా కనిపిస్తే దానిని PIB ఫాక్ట్ చెక్‌కి పంపాలని సూచించింది.
దీని కోసం ప్రభుత్వ అధికారిక ఫాక్ట్ చెక్ హెల్ప్‌లైన్ నంబర్ +91 8799711259 కు WhatsApp సందేశం పంపవచ్చు.ఈ నేపథ్యంలో ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది: అనధికారికంగా సోషల్ మీడియాలో వచ్చే సమాచారం నమ్మకండీ, ఏదైనా సందేహం ఉంటే అధికారిక వేదికలపైనే విశ్వాసం ఉంచండి. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో అందరూ బాధ్యతగా ఉండాలని సూచించింది.