మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో చేతికి ఓ ప్రత్యేకమైన సిరా పూయడం గమనించే ఉంటారు. ఓ పట్టాన వదలని ఆ సిరాను ఎవరు తయారు చేస్తారు ? ఎక్కడ తయారు చేస్తారా తెలుసా ? ఈ స్టోరీలో ఆ వివరాలు తెలుసుకోండి.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మరి కొన్ని రోజుల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. వచ్చే వారం షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో మొదటి దశ లోక్ సభ ఎన్నికల జరిగే అవకాశం ఉంది.
undefined
అయితే ఎన్నికల్లో ఓటు వేసేందుకు బూత్ కు వెళ్లినప్పుడు అధికారులు ఓటరు చేతికి ఓ సిరా పూస్తారు. సామాన్యుడి నుంచి ప్రముఖుడి వరకు, సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడి వరకు ఎవ్వరైనా సరే ఓటు వేసిన సమయంలో ఈ సిరా కచ్చితంగా పూసుకోవాల్సిందే. అదే ఎన్నికల్లో రెంటో సారి ఓటు వేయకుండా అడ్డుకట్ట వేసేందుకు దీనిని ఉపయోగిస్తారు.
ఎన్నికలు ముగిసినా.. చాలా రోజుల వరకు చేతికే ఉండిపోయే ఈ సిరాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సిరాను దేశంలోని ఒకే ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీ పేరు ఎమ్ పీవీఎల్ (మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్) తయారు చేస్తుంది. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఉపయోగించే సిరా ఈ కంపెనీ నుంచే వస్తుంది. ఇది ఓ ప్రభుత్వ సంస్థ.
కాగా.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ కంపెనీ గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి పెద్ద ఆర్డర్ ను అందుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం 26.5 లక్షల వయల్స్ కావాలని భారత ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు అందాయి. 26.5 లక్షల వయల్స్ విలువ రూ.55 కోట్లు ఉంటుంది. మార్చి 15లోగా కంపెనీ ఆర్డర్ అందిచాల్సి ఉంటుంది. ఒక సీసాలో 10 మిల్లీలీటర్ల సిరా ఉంటుంది. దీనిని 700 మందికి పైగా ఓటర్ల వేలికి పూయవచ్చు.
2023 డిసెంబర్ లో ఎన్నికల సంఘం ఈ కంపెనీకి సిరా కోసం ఆర్డర్ ఇచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన సిరాను ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఇందులో ఉత్తర్ ప్రదేశ్ కు అత్యధికంగా, లక్ష ద్వీప్ కు అతి తక్కువ సిరా అందుతుంది. సిరాను కూడా ఎమ్ పీవీఎల్ ఎగుమతి చేస్తుంది.
ఈ సిరాను మన దేశంతో పాటు 60 దేశాలకు కూడా ఈ కంపెనీయే అందజేస్తుంటుంది. కర్ణాటకలోని మైసూర్ లో ఎంపీవీఎల్ 1937 లో మైసూర్ లక్ ఫ్యాక్టరీగా స్థాపించారు. కొన్నేళ్లుగా ఈ సంస్థ సిరాల ప్రాథమిక,ప్రత్యేకమైన తయారీదారుగా మారింది. మైసూర్ ల్యాక్ ఫ్యాక్టరీ అనే సంస్థ మొదట్లో లక్కర్, పెయింట్లను ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ 1989 లో వార్నిష్ ఉత్పత్తిలోకి విస్తరించింది. ఆ తర్వాత మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్ లిమిటెడ్ గా పేరు మార్చారు.