అయోధ్య రామయ్యకు 'సూర్యతిలకం' దిద్దిన వేళ ... ప్రధాని మోదీ ఏం చేసారో తెలుసా..?

By Arun Kumar PFirst Published Apr 17, 2024, 2:32 PM IST
Highlights

శ్రీరామ నవమి పర్విదినాన... అదీ అయోధ్య రామమందిరంలో కొలువైన బాలరాముడికి సూర్య కిరణాలే తిలకంగా మారి అలంకరిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు..?...

అస్సాం : దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక జన్మభూమి అయోధ్యలో రామనవమి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గర్భగుడిలో కొలువైన ఆ బాలరామయ్యకు స్వయంగా ఆ సూర్యభగవానుడే తిరకం దిద్దాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు రెండుకళ్లు చాలలేవని రామభక్తులు, హిందువులు అంటున్నారు. కొద్దిసేపు అయోధ్య రాముడి నుదిడిపై ప్రకాశవంతంగా సూర్యకిరణాలు పడటంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది.  

అయితే ఇలా అయోధ్య రామయ్యకు ఆ సూర్యుడి కిరణాలే తిలకంగా మారిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం ఎన్నికల ప్రచారంలో వున్నారు. దీంతో ప్రచార సభలో పాల్గొన్నవారిని తమ సెల్ ఫోన్లు తీసి టార్చ్ లైట్ ఆన్ చేయాల్సిందిగా ప్రధాని సూచించారు. దీంతో అక్కడున్నవారంతా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ మొబైల్ లైట్స్ ఆన్ చేసారు. ఇలా అయోధ్య రామయ్యకు'సూర్యతిలకం' దిద్దినవేళ ప్రధాని సరికొత్తగా ఆ రామయ్యను స్మరించుకున్నారు... ప్రజలచేత రామనామ స్మరణ చేయించారు. 

రామనవమి పర్వదినాన అయోధ్య రామమందిరంలో ఆవిష్కృతమైన అద్భుతం సన్నివేశంపై కూడా ప్రధాని స్పందించారు. ''ఈరోజు జరుపుకుంటున్న రామనవమి చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగివుంది. శ్రీరాముడు పుట్టిపెరిగిన అయోధ్యలో ఈసారి వేడుకలు జరుగుతున్నాయి. దశాబ్దాల తర్వాత రామయ్య తన జన్మస్థలానికి చేరుకురి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇలాంటి పవిత్రమైన రోజున అయోధ్యలో కొలువైన రామయ్యకు సూర్య కిరణాలు తిలకంగా మారి అలంకరించాయి. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది'' అని ప్రధాని అన్నారు. 

రామయ్యకు సూర్యతిలకం : 

శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఇవాళ ఉదయంనుండి అయోధ్య రామమందిరంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయ పూజారులు ప్రత్యేక పూజల అనంతరం అయోధ్య రామయ్య దర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పించారు. అయితే భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అద్భుత దృశ్యం సరిగ్గా మధ్యాహ్నం 12గంటలకు ఆవిష్యృతం అయ్యింది.

గర్భగుడిలో కొలువైన బాలరాముడి నుదిటిపై ప్రకాశవంతమైన కాంతితో సూర్యకిరణాలు పడ్డాయి. ఇలా 3 నుండి 4 నిమిషాల పాటు సూర్యతిలకంతో అయోధ్య రామయ్య దర్శనం ఇచ్చాడు. ఈ సమయంలో భక్తుల జైశ్రీరామ్ నినాదాలతో అయోధ్య ఆలయం మారుమోగింది. అంతేకాదు ఈ దృశ్యాన్ని టివీల్లో లైవ్ చూస్తున్న భక్తులు తన్మయత్వాన్ని లోనయ్యారు.

గర్భగుడిలోని బాలరాముడిపై సూర్యకిరణాలు ఎలా పడ్డాయి..? 

అయోధ్య రామమందిరం దేశంలోని మెజారిటీ ప్రజల దశాబ్దాల కల. దాన్ని నెరవేరుస్తూ రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం జరిగింది. దేశ ప్రజల సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామమందిర నిర్మాణం జరిగింది.  ఇలా నిర్మించిన రామాలయం అద్భుత శిల్పకళా సంపదతో అందంగానే కాదు మరెన్నో ప్రత్యేకతలు కలిగివుంది. అందులో ఎంతో కీలకమైనది ఈ 'సూర్యతిలకం' 

రఘువంశోత్తముడైన ఆ బాలరాముడి కొలువైన  గర్భగుడిలోకి సరిగ్గా శ్రీరామనవమి రోజులు సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇందుకోసం ఆలయ నిర్మాణ సమయంలోనే కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల సహకారం తీసుకుంది ట్రస్ట్. ఇలా శ్రీరామ నవమి రోజున సరిగ్గా 12 గంటలకు అయోధ్య బాలరాముడికి సూర్యకిరణాలు తిలకం దిద్దాయి. 

అయోధ్య మందిర నిర్మాణం సమయంలోనే శిఖరభాగంలో ఓ ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటుచేసారు. ఇది సూర్యకిరణాలను గ్రహిస్తుంది. ప్రతిరోజూ కొంత కదులుతూ సరిగ్గా రామనవమి నాటికి ఓ స్ధానానికి వచ్చేస్తుంది. ఈ స్థానంలోకి వచ్చిన పరికరంపై సూర్యకిరణాలు పడగానే అవి నేరుగా గర్భగుడిలోకి ప్రసరిస్తాయి. సరిగ్గా 12 గంటలకు ఈ కిరణాలు బాలరాముడి నుదిటిపైకి చేరతాయి. 

click me!