
లక్నో: ఉత్తరప్రదేశ్ ఘోసి స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే ఈ బైపోల్‌లో గట్టి పోటీ నెలకొంది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నది. ఈ సందర్భంలో బీఎస్పీ పోటీ నుంచి తప్పుకుంది. అంతేకాదు.. బీఎస్పీ ఎన్నడూ లేని ఒక కొత్త విధమైన పిలుపు ఇచ్చింది. తమ పార్టీ వర్కర్లను ఓటు వేయవద్దని కోరింది. ఒక వేళ వేయాలనే అనుకుంటే నోటాకు వేయాలని సూచించింది. తమ పార్టీ వర్కర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఎస్పీ సుప్రీమో సూచించారు.
ఉత్తరప్రదేశ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ పాల్ స్పష్టత ఇస్తూ.. ఘోసి ఎన్నికలో బీఎస్పీ పాల్గొనడం లేదని, కాబట్టి, తమ పార్టీ వర్కర్లను ఈ ఎన్నికలో పాల్గొనవద్దని చెప్పారు. కొన్ని నియమాలకు లోబడి బీఎస్పీ ఘోసి ఉప ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించుకుందని, కాబట్టి, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వాలనీ నిర్ణయించుకోలేదని తెలిపారు.
Also Read: తమిళ నాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తా: అయోధ్య సాధువు ప్రకటన (Video)
ఇలాంటి పరిస్థితులు బీఎస్పీ ఓటర్లు కూడా ఇంటి వద్దే ఊరికే ఉండిపోవాలని, లేదంటే నోటాకు ఓటేయాలని సూచించారు. బీజేపీ ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని ప్రారంభించిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తున్నదని ఆరోపించారు. ఈ కొత్త ధోరణికి నిరసన గానే తాము ఈ ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు.