ఢిల్లీకి చేరిన కర్ణాటక సీఎం పంచాయతీ.. డీకే, సిద్ధూలకు హస్తిన నుంచి పిలుపు, అధిష్టానం కోర్టులో బంతి

Siva Kodati |  
Published : May 14, 2023, 09:16 PM ISTUpdated : May 14, 2023, 09:22 PM IST
ఢిల్లీకి చేరిన కర్ణాటక సీఎం పంచాయతీ.. డీకే, సిద్ధూలకు హస్తిన నుంచి పిలుపు, అధిష్టానం కోర్టులో బంతి

సారాంశం

కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్ధరామయ్యలను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. సీఎం ఎంపిక వ్యవహారం తేలకపోవడంతో పాటు సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఈ బాధ్యతను అధిష్టానం  చేతికి అప్పగించారు. 

కర్ణాటకలో సీఎం అభ్యర్ధి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్ధరామయ్యలు ముఖ్యమంత్రి రేసులో వున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక కోసం బెంగళూరులోని షంగ్రిల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. డీకే, సిద్ధూలతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా హోటల్‌కు చేరుకున్నారు. అయితే కొత్త సీఎం ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 

అలాగే మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో తీర్మానించారు. దీనితో పాటు గ్యారెంటీ స్కీమ్‌లను అమలు చేయాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. దీంతో వీరిద్దరూ ఇవాళ రాత్రికి గాని, సోమవారం ఉదయం గాని ఢిల్లీకి చేరుకునే అవకాశం వుంది. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతో వీరిద్దరూ భేటీకానున్నారు. దీంతో కొత్త సీఎం ఎవరు కానున్నారనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు రేపు కూడా సీఎల్పీ భేటీ జరగనుంది. 

Also Read: సిద్ధరామయ్యతో విభేదాలు.. తేల్చేసిన డీకే శివకుమార్, పార్టీ కోసం త్యాగాలు చేశానన్న కేపీసీసీ చీఫ్

కాగా.. సీఎల్పీ సమావేశం జరిగిన షంగ్రిల్లా హోటల్ వద్దకు  డీకే, సిద్ధరామయ్య అభిమానులు చేరుకుని నానా హంగామా సృష్టించారు. తమ నేతనే సీఎంగా చేయాలని వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఈ గుంపును చెదరగొట్టారు. అంతకుముందు సిద్ధరామయ్య, శివకుమార్ ఇళ్ల వద్ద కూడా ఇదే హైడ్రామా నడిచింది. తమ నేతను సీఎం చేయాలంటూ వారి మద్ధతుదారులు నినాదాలు చేయడంతో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే తమకు విధేయులైన ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య , డీకే శివకుమార్‌లు విడివిడిగా భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు.. మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..