
బెంగళూరు: భర్తను భార్య తరుచూ నల్లవాడని పిలవడం క్రూరత్వమే అవుతుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. విడాకుల కోసం విజ్ఞప్తి చేసుకున్న ఆ భర్తకు విడాకులు ఇవ్వడానికి ఇదొక బలమైన కారణం అవుతుందని వివరించింది. 44 ఏళ్ల భర్త, 41 ఏళ్ల భార్యకు విడాకులు ఇస్తూ ఈ కర్ణాటక హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భర్తను తరుచూ నల్లరంగు వాడని అవమానించిందని, ఈ కారణంగానే ఆమె భర్తకు దూరంగా వెళ్లిపోయిందని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే నిర్ధారణకు రావొచ్చని వివరించింది.
ఈ కోణాన్ని కప్పి పుచ్చడానికి ఆమె భర్తపై తప్పుడు ఆరోపణలు చేసిందని, ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టిందని, ఆ అక్రమ సంబంధం ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చాడని ఆరోపించిందని హైకోర్టు తెలిపింది. ఈ వాస్తవలు క్రూరత్వాన్ని నిరూపిస్తున్నాయని వివరించింది. నలుపు రంగువాడని ఆమె తరుచూ భర్తను అవమానించేదని, ఆ అవమానాన్ని ఆడ బిడ్డ కోసం భరిస్తూ ఉండేవాడనీ తెలిపింది. హిందు మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 (ఐ)(ఏ) కింద జరిగిన వారి వివాహ బంధాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
బెంగళూరుకు చెందిన ఆ జంట 2007లో పెళ్లి చేసుకుంది. ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. 2012లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకులు మంజూరు చేయాలని భర్త కోరాడు. ఆ అప్పీల్‌ను జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనంత్ రామనాథ్ హెగ్డే విని తీర్పు ఇచ్చారు.
ఆమె 498 కింద భర్త, భర్త కుటుంబంపై గృహ హింస కేసు పెట్టింది. భర్త చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆమె ప్రత్యారోపణలు చేసింది. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ మహిళతో ఓ బిడ్డకు జన్మనిచ్చాడని ఆరోపించింది. ఫ్యామిలీ కోర్టు వాదనలు విని భర్త విడాకుల విజ్ఞప్తిని కొట్టివేసింది.
2017లో ఆ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. భర్తపై ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవాలు, నిర్హేతుకాలు, అలాంటి ఆరోపణలు చేయడం దారుణం అంటూ హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ఆరోపణలు చేసిన ఆ మహిళ తీవ్ర మానసిక క్రూరత్వాన్ని ప్రదర్శించిందనీ చెప్పవచ్చని వివరించింది.
భర్త కుటుంబంతో కలిసి ఉండే ప్రయత్నమేదీ భార్య చేయలేదని, భర్త నలుపు రంగు వల్ల ఆయనతో జీవించడానికి ఆమె విముఖంగా ఉన్నారని ఈ పరిస్థితులు చూస్తే అర్థం అవుతుందని హైకోర్టు తెలిపింది. కాబట్టి, వీరికి విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును కోరింది.