దావూద్ ఇల్లు కూల్చవు, కానీ కంగనా ఆఫీస్ కూలుస్తావ్: ఉధ్ధవ్ పై ఫడ్నవీస్

By telugu teamFirst Published Sep 11, 2020, 3:11 PM IST
Highlights

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని పాక్షికంగా బీఎంసీ పాక్షికంగా కూల్చివేయడంపై బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. దావూద్ పేరు ఎత్తుతూ ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ పాక్షికంగా కూల్చిన ఘటనపై బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ప్రతిస్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దావూద్ ఇబ్రహీం ఇంటిని కూల్చవు గానీ నటి ఇంటిని కూల్చడానికి సిద్ధపడుతావని ఆయన ఉద్దవ్ థాకరేను ఉద్దేశించి అన్నారు. 

నటిపై పోరాటం చేయడాన్ని పక్కన పెట్టి కరోనా వైరస్ మీద పోరాటం చేయాలని ఆయన మహారాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఈ రోజు అత్యధిక కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయని ఆయన అన్నారు. ప్రతి రోజు 23 వేల నుంచి 25 వేల వరకు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 40 శాతం మహారాష్ట్ర నుంచే రికార్డవుతున్నాయని ఆయన అన్నారు. 

Also Read: 'మహా' జగడం: సోనియా గాంధీని టార్గెట్ చేసిన కంగనా రనౌత్

మహారాష్ట్ర ప్రభుత్వానికి కరోనా వైరస్ మీద పోరాటం చేయడం ఇష్టం లేదని, కంగనాపై పోరాటం చేస్తోందని ఆయన అననారు. కంగనాపై పోరాటం చేయడానికి పెడుతున్న శక్తిలో సగం శక్తి పెట్టినా రాష్ట్రంలో చాలా ప్రాణాలను కాపాడగలదని ఆయన అన్నారు. ప్రాధాన్యతలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన అన్నారు. 

బీహార్ ఎన్నికల కోసం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని విమర్శలకు ఫడ్నవీస్ సమాధానమిచ్చారు. కంగనా అంశాన్ని బిజెపి ఎప్పుడు కూడా లేవనెత్త లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ముంబైకి రావద్దని ఎందుకు హెచ్చరించిందని ఆయన అడిగారు.

Also Read: కంగనా 'మహా' జగడం: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఎంట్రీ

కంగనా రనౌత్ జాతీయ నాయకురాలేమీ కారని, అయినప్పటికీ ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆయన అన్నారు. దావూద్ ఇంటిని కూల్చడానికి సిద్ధపడరు గానీ నటి ఇంటిని కూల్చాలని కోరుకుంటున్నారని అంటూ దీంతో బిజెపికి సంబంధం ఏమిటని ఆయన అడిగారు. 

click me!