Devendra Fadnavis: నవాబ్ మాలిక్ అండర్ వరల్డ్ వ్యక్తుల నుంచి భూమి కొన్నాడు.. సంచలన ఆరోపణలు చేసిన ఫడ్నవీస్

By team teluguFirst Published Nov 9, 2021, 4:54 PM IST
Highlights

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు (Nawab Malik) అండర్ వరల్డ్‌తో (underworld) సంబంధాలు ఉన్నాయని.. వారితో మాలిక్, అతని కుటుంబ సభ్యులు భూఒప్పందాలు చేసుకున్నారని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఆరోపించారు. 

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ (Nawab Malik) తనపై చేసిన ఆరోపణలకు దీపావళి తర్వాత అసలైన బాంబు పేల్చనున్నట్టుగా చెప్పిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis)  సంచలనానికి తెరతీశారు. నవాబ్ మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని.. వారితో మాలిక్, అతని కుటుంబ సభ్యులు భూఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. మంగళవారం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమాచారం తన వద్ద లేదని అన్నారు. తనకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే.. అప్పుడే దీని గురించి వివరాలు వెల్లడించి ఉండేవాడినని చెప్పారు. 

‘మాలిక్, అతని కుటుంబం.. 1993 ముంబై పేలుళ్ల దోషి సర్దార్ షా వలీ ఖాన్, మహ్మద్ సలీం పటేల్ నుంచి 2005లో కుర్లాలో 2.8 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పటి మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు ఈ భూమిని కొనుగోలు చేశారు. మాలిక్, అతని కుటుంబ సంస్థ సాలిడస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2005 నుంచి 2019 మధ్య అండర్ వరల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో లావాదేవీలను కలిగి ఉన్నారని బిజెపి నాయకుడు ఆరోపించారు. దావూద్ దేశం నుంచి పారిపోయిన తర్వాత హసీనా పార్కర్ ద్వారా భూకబ్జా జరిగింది. నా వద్ద ఐదు ఆస్తి ఒప్పందాల పత్రాలు ఉన్నాయి.. వాటిలో నాలుగు అండర్ వరల్డ్‌తో లావాదేవీలను కలిగి ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

Also read: NCP వర్సెస్ BJP: దీపావళి తర్వాత బాంబు పేలుస్తా.. ఎన్‌సీపీ మంత్రిపై మాజీ సీఎం ఫడ్నవీస్ ఫైర్

కుర్లా ప్లాట్ ఒప్పందం 2003లో ప్రారంభమై 2005లో నవాబ్ మాలిక్ మంత్రిగా ఉన్నప్పుడు ముగిసింది. సలీం పటేల్ ఎవరో మీకు తెలియదా? ముంబైలో పేలుళ్లకు పాల్పడిన వారి నుంచి ఎందుకు భూమిని కొనుగోలు చేశారు? పేలుళ్లలో ముంబైవాసులను చంపడానికి కారణమైన వ్యక్తులతో మీరు వ్యాపారం చేశారు’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని ఆరోపించారు.

కుర్లా ప్లాట్ డీల్ వివరాలను వివరిస్తూ.. 2.80 ఎకరాల ప్లాట్‌ను సాలిడస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసిందని ఫడ్నవిస్ చెప్పారు. “ఓనర్లు మరియం గోవాలా, మునీరా ప్లంబర్‌లకు పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ సలీం పటేల్. మరొక విక్రేత సర్దార్ షా వలీ ఖాన్. ఇది నవాబ్ మాలిక్ కుటుంబానికి చెందిన సొలిడస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించబడింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన వ్యక్తి ఫరాజ్ మాలిక్. నవాబ్ మాలిక్ 2019 వరకు సాలిడస్‌లో భాగంగా ఉన్నారు’ అని ఫడ్నవీస్ చెప్పారు.

Also read: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: ఆర్యన్ అరెస్ట్ పెద్ద కుట్ర.. ముంబై పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం

టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) (టాడా) చట్టం, 1987 ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ప్లాట్‌ను కాపాడేందుకు ఇలా చేశారా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. 2005లో ఆ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ. 2,053 ఉండగా.. 3 ఎకరాల ప్లాట్‌ను చదరపు అడుగుకు ₹25 చొప్పున ₹30 లక్షలకు కొనుగోలు చేశారని అన్నారు. రూ. 15 లక్షలు పవర్ ఆఫ్ అటార్నీ సలీం పటేల్‌కు చెల్లించబడింది.. సర్దార్ షా వలీ ఖాన్‌కు రూ. 5 లక్షలు చెల్లింపు జరిగిందని చెప్పారు. ఈ డీల్‌పై దర్యాప్తు చేయడానికి సంబంధిత అధికారికి పత్రాలు, సాక్ష్యాలను అందజేస్తానని ఫడ్నవీస్ చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ,  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ని సంప్రదించవచ్చని చెప్పారు.

తన వద్ద ఉన్న పత్రాలను ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవర్‌కు పంపుతానని.. అప్పుడు ఆయనకు తన మంత్రి ఎలాంటి వ్యక్తో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న పత్రాలను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి కూడా పంపనున్నట్టుగా తెలిపారు. 

మహారాష్ట్రలో క్రూయిజ్ షిప్ డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. షారుఖ్ కుమారుడు నిందితుడిగా ఉన్న ఈ కేసు.. రాజకీయ నేతల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. కేసు విచారణ అధికారి సమీర్ వాంఖడే‌తో పాటుగా, బీజేపీపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఫడ్నవీస్‌కు డ్రగ్ డీలర్స్‌లో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే స్పందించిన ఫడ్నవీస్.. మాలిక్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని.. దీపావళి తర్వాత అసలై బాంబు పేలుస్తానని చెప్పారు. 

click me!