
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో దేశ రాజకీయాలను మలుపు తిప్పే తీర్పు ఇచ్చారు. తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టబెట్టి జాతీయ రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయానికి బీజం వేశారు. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ ఎన్నికల్లో మరో ఆశ్చర్యకర ఘట్టం ఉన్నది. ఆయన సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీనే ఓడించి ఆప్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ, ఆయన తల్లి మాత్రం ఎప్పట్లాగే స్కూల్‌లో స్వీపర్‌గా పని చేయడానికి వెళ్లింది. ఆయన తండ్రి దినసరి కూలీ. ఆయన తన కూలీని కొనసాగిస్తున్నాడు. వారిని కదిలిస్తే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా మాట్లాడారు.
ఆప్ నేత లాభ్ సింగ్ ఉగోకె కష్టపడి పని చేసే తత్వం. పార్టీ కోసం నిరంతరం శ్రమించాడు. స్వల్ప కాలంలోనే పార్టీలో ర్యాంకులు ఎదిగాడు. 2017లో బధౌర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. కానీ, పార్టీ కాదన్నది. నిరాశ చెందలేదు. మళ్లీ ఈ సారి కోరుకున్నాడు. పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా పోటీ చేశాడు. సీఎం పోటీ చేస్తున్నా.. ఆయనకు లెక్క లేదు. ఎందుకంటే.. అక్కడివారందరికీ ఆయన ఆప్తుల్లాగే మెలిగాడు. ఫలితాలు చూస్తే.. సీఎం చన్నీకి షాక్. 37,550 ఓట్ల మార్జిన్‌తో లాభ్ సింగ్ ఉగోకె విజయం సాధించాడు. ఇదిలా ఉంటే.. లాభ్ సింగ్ ఉగోకె తల్లిదండ్రులు మరింత ఆశ్చర్యపరుస్తున్నారు. తమ కొడుకు సీఎంనే ఓడించి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. రాష్ట్రమంతా ఆయన గురించే చర్చలు చేస్తున్నప్పటికీ వారు అదేమీ పట్టించుకోవడం లేదు. తమ కొడుకే గెలుస్తాడని తమకు నమ్మకం ఉండిందని అన్నారు.
తమ కొడుకు ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రానా దాని ద్వారా తాము లబ్ది పొందాలని భావించడం లేదని స్పష్టం చేయడంతో అందరూ నోరెళ్లబెట్టారు. తాము సంపాదించుకోవడానికి, ఇళ్లు గడుపుకోవడానికి ఎప్పుడూ కష్టపడే పని చేశామని, ఇకపైనా తమ కొడుకు ఎంత స్థాయికి ఎదిగినా.. కష్టాన్నే నమ్ముకుంటామని స్పష్టం చేశారు. అందుకే ఇది వరకు తాను పని చేసినట్టుగానే ఇకపైనా స్కూల్‌లో స్వీపర్‌గానే కొనసాగుతానని ఎమ్మెల్యే లాభ్ సింగ్ ఉగోకె తల్లి బల్దేవ్ కౌర్ వెల్లడించారు. తన కొడుకు విజయంపై సంతోషాన్ని పంచుకున్న ఆమె.. ఆప్ పార్టీ గుర్తు చీపురును ఉటంకిస్తూ.. చీపురు తమ జీవితంలో ముఖ్యపాత్ర పోషించిందని వివరించారు.
బల్దేవ్ కౌర్ పని చేస్తున్న పాఠశాల ప్రిన్సిపల్ అమృత్ పాల్ కౌర్ మాట్లాడుతూ, లాభ్ సింగ్ ఉగోకె తల్లి చాలా కాలం నుంచి స్కూల్‌లోనే పని చేస్తున్నారని వివరించారు. లాభ్ సింగ్ కూడా ఇదే స్కూల్‌లో చదువుకున్నారని తెలిపారు. ఆయన ఈ స్కూల్‌కు, గ్రామానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారని చెప్పారు. లాభ్ సింగ్ తల్లి మాత్రం ఎప్పట్లాగే ఇదే పాఠశాలలోనే పని చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు.
లాభ్ సింగ్ ఉగోకె తండ్రి దర్శన్ సింగ్ మాట్లాడుతూ, తమ కుటుంబం ఇది వరకు జీవించినట్టే జీవిస్తుందని వివరించారు. తన కొడుకు తమ కుటుంబంపై ఫోకస్ పెట్టడానికి బదులు ప్రజలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తమ గ్రామ ప్రజలు ఆయనను ఎన్నుకున్నారని, తన కొడుకు వారందరి కోసం పనిచేయాలి అని అన్నారు. తాము ఇంతకు ముందు జీవించినట్టే ఇకపైనా కష్టపడే జీవిస్తామని తెలిపారు.