Dengue: దేశ రాజధానిలో ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తోంది. 2016 తర్వాత మళ్లీ ఇప్పుడే అధికంగా డెంగ్యూ మరణాలు సంభవించాయి. ఈ ఏడాదిలో ఢిల్లీలో డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరగా, మొత్తం కేసులు 9,545కు పెరిగాయి.
Dengue: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ఏడాది డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో డెంగ్యూ పంజా విసురుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఢిల్లీలో డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరింది. డెంగ్యూ కేసులు, మరణాలకు సంబంధించి సోమవారం నాడు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబరు 18 వరకు డెంగీ కారణంగా ప్రణాలు కోల్పోయిన వారి సంఖ్య 17గా ఉండగా, డిసెంబరు 25 నాటికి ఈ సంఖ్య 23కు పెరిగింది. గతంలో వివరాలు గమనిస్తే.. గత ఐదేండ్లలో పోలిస్తే ఈ ఏడాదే (2021) ఢిల్లీలో అత్యధిక డెంగీ మరణాలు సంభవించాయి. అంటే 2016 తర్వాత ఢిల్లీలో అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి.
Also Read: Brazil Floods: బ్రెజిల్ ను ముంచెత్తిన వరదలు.. ఎటుచూసినా వరద నీరే.. !
undefined
దేశ రాజధాని ఢిల్లీలో 2016లో 10 డెంగ్యూ మరణాలు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది ఢిల్లీలో 23 డెంగ్యూ మరణాలు సంభవించాయి. గత రెండు నెలల వ్యవధిలోనే ఓ ఎనిమిది నెలల శిశువు సహా ఆరుగురు మైనర్లు డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, డెంగ్యూ బారినపడుతున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. ఒక్క డిసెంబర్ నెలలోనే ఢిల్లీలో 1,269 మంది డెంగీ బారినపడ్డారు. మొత్తంగా ఈ ఏడాదిలో (డిసెంబర్ 25వరకు) ఢిల్లీలో నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య 9,545కు పెరిగిందని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నివేదిక పేర్కొంది. గత ఐదేండ్లతో పోలిస్తే ఈ ఏడాదిలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయి. 2016లో ఢిల్లీలో 4,431 డెంగ్యూ కేసులు,2017లో 4,726 కేసులు,2018లో 2,798 కేసులు,2019లో 2,036 కేసులు,2020లో 1072 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూకు కారణమయ్యే దోమ లార్వాలు స్వచ్చమైన, నిల్వ నీటిలో అధికంగా వృద్ధి చెందుతాయి. వెక్టర్ ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధి కేసులు సాధారణంగా జులై, నవంబర్ మధ్య వరకు అధికంగా నివేదించబడతాయి. అయితే, ఈసారి మాత్రం డిసెంబర్ నెలవరకు నమోదవుతున్నాయి.
Also Read: Telangana: తెలంగాణలో కరెంట్ షాక్.. ఇక ఛార్జీల మోతే !
ఇదిలావుండగా, ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు.. ప్రస్తుతం మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం ఢిల్లీ పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం 14,43,352 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే, వైరస్ తో పోరాడుతూ 25,105 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 14.17 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ కేసులు కూడా ఢిల్లీలోనే అధికంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 142 కేసులు ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యధికం. అలాగే మహారాష్ట్ర (141), కేరళ (57), గుజరాత్ (49) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు తీసుకుంటుంది. కరోనాను అదుపులో ఉంచుకునేందుకు ముందస్తుగానే ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
Also Read: Afghanistan: రాక్షస పాలనకు నాంది.. ఆఫ్ఘాన్ తాలిబన్ సర్కారు మరో సంచలన నిర్ణయం