Delimitation: ఉత్తరాది, దక్షిణాది మధ్య డీలిమిటేషన్ వివాదం! ఎందుకు ఈ వివాదం?

By Mahesh K  |  First Published Sep 26, 2023, 5:28 PM IST

డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల నుంచి అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం జనాభా ఆధారంగా నిర్వహించి ఫ్యామిలీ ప్లానింగ్ వంటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లను తగ్గించి శిక్షిస్తారా? అని ప్రశ్నలు వస్తున్నాయి. డీలిమిటేషన్‌తో యూపీ, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో రెండంకెల స్థాయిలో సీట్ల పెరుగుదల ఉంటుందని, దక్షిణాదిలో సీట్లను కోల్పోయే ముప్పు ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 


న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ఉత్తరాది, దక్షిణాదిల మధ్య వివాదానికి ఆజ్యం పోసేలా ఉన్నది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి డీలిమిటేషన్ పై ఆందోళనలు వెలువడుతున్నాయి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటికే అభ్యంతరాలు వస్తున్నాయి. ఇంతకీ ఈ అభ్యంతరాలు ఏమిటీ? డీలిమిటేషన్ ప్రక్రియ ఏమిటీ? దాని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఏమిటీ? ఈ విషయాలను చూద్దాం.

ప్రతి పదేళ్లకు ఒక సారి జనాభ గణన ఉంటుంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభాను గణించిన తర్వాత పెరిగిన జనాభాకు తగినట్టుగా ప్రాతినిధ్యాన్ని సవరించడానికి డీలిమిటేషన్ అనే ప్రక్రియ చేపడతారు. తద్వార జనాభా, ఇతర అంశాలను ప్రాతిపదిక చేసుకుని నియోజకవర్గాలను పునర్వ్యస్థీకరిస్తారు. ఈ ప్రక్రియలో నియోజకవర్గాల సంఖ్య సహజంగా పెరుగుతుంది. చివరిసారిగా 2001 జనాభా గణన లెక్కల ఆధారంగా 2002లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే, 2002లో నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు.

Latest Videos

ఇక దక్షిణాది అభ్యంతరాల వద్దకు వస్తే.. 2021లో జనాభా గణన నిర్వహించాల్సింది. కానీ, జనాభాను గణించలేదు. 2026లో జనాభా 1.42 బిలియన్లకు చేరుతుందని అంచనా. నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయించడానికి కీలకమైంది. అయితే, జనాభా దేశమంతటా ఒకేలా పెరగదని తెలిసిందే. ఫ్యామిలీ ప్లానింగ్ వంటి కార్యక్రమాలను కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు సమర్థవంతగా అమలు చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో అమలు చేయలేదు. అందుకే దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలో జనాభా విస్ఫోటనంగా ఉన్నది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ వంటి కార్యక్రమాలు చాలా సమర్థంగా అమలు చేశాయి. 

Also Read: Delimitation: దక్షిణాది వాణి అణచాలని చూస్తే బలమైన ప్రజా ఉద్యమం తప్పదు: కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణనలో జనాభా అంశం ప్రధానంగా ఉంటుండటంతో దక్షిణాది రాష్ట్రాలు ఆందోళనలో ఉన్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ వంటి మంచి కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు దక్షిణాది రాష్ట్రాలు శిక్షను అనుభవించాలా? అని ప్రశ్నిస్తున్నాయి. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నిధులనూ ఎందుకు కోల్పోవాలి? అని అడుగుతున్నాయి. ఇది పరోక్షంగా ఉత్తరాది, దక్షిణాది అనే విభజనను తప్పక తెస్తుందని, ఇది కొత్త వివాదానికి ఆజ్యం పోసినట్టు అవుతుందని హెచ్చరిస్తున్నాయి.

తమిళనాడులో జనాభా వృద్ధిని ఆరు శాతానికి నియంత్రించగలిగిందని డీఎంకే ఎంపీ కనిమొళి ఎన్‌వీఎన్ సోము ఓ డిబేట్‌లో అన్నారు. కానీ, ఉత్తరాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ సరిగా అమలు చేయలేదని, అందుకే ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల భారీగా ఉన్నదని తెలిపారు.

ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రెజెంటేషన్ అనే 2019 రీసెర్చ్ పేపర్ ప్రకారం, 2031 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్(ప్రస్తుత డీలిమిటేషన్ 2026 తర్వాత జరగనుంది) బిహార్, ఉత్తరప్రదేశ్‌లు అదనంగా 21 సీట్లు పొందగలిగితే.. తమిళనాడు, కేరళలు కలిపి 16 సీట్లను కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నిర్వహించబోయే డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలు సీట్లను కోల్పోవడమే కాకుండా.. ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టున్న పార్టీల అధికార శక్తి గణనీయంగా పెరుగుతుంది.

దక్షిణాదిలో పట్టు సాధించడం బీజేపీకి కష్టతరమైంది. కాబట్టి, డీలిమిటేషన్ అనే ఆయుధంతో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ పంజా వేస్తుందని దీని ప్రత్యర్థి పార్టీలు అనుమానిస్తున్నాయి. దక్షిణాదిలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. బీజేపీ తనకు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌ను చూడదని, ఈ ప్రాంతీయ పార్టీలనే చూస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. 

అయితే, దక్షిణాది రాష్ట్రాల గళాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. డీలిమిటేషన్ కమిషన్‌లో అన్ని పార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉంటుందనీ వారు వివరిస్తున్నారు. కాబట్టి, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను నివృత్తి చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

click me!