
Jai Shri Ram slogans inside mosque: మసీదు లోకి చొరబడిన ఇద్దరు యువకులు.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. 'బయారీలను' (ముస్లింలను) బతకనివ్వబోమని ఆ యువకులు బెదిరించారని మసీదు మతగురువు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో మసీదులోకి చొరబడి జై శ్రీరామ్ నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అరెస్టయిన యువకులను బిలినేల్ సోడ్లు నివాసి కీర్తన్, కైకాంబ నెడ్టోట నివాసి సచిన్ గా గుర్తించారు. ఈ సంఘటన కడబ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన నిందితులు మసీదు ఆవరణలోకి చొరబడి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. మసీదు మతగురువు బయటకు వచ్చేసరికి యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. మసీదులోని సీసీటీవీ కెమెరాలో నిందితుల దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
మసీదులోకి చొరబడిన యువకులు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, బయారీలను (ముస్లింలను) బతకనివ్వబోమని బెదిరించారని ఫిర్యాదులో మతగురువు వివరించారు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీయడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.